స్విస్ టూరిస్టుకు ఏడాది జైలు
- హిందూ పండుగను అవమానిస్తూ పోస్టులు
- తీవ్రంగా స్పందించి శిక్ష విధించిన కోర్టు
జకర్తా, ఆగస్టు 23: ఇండోనేషియాలోని బాలి రిసార్ట్ ద్వీపంలో, ఒక పవిత్ర బాలి హిందూ పండుగను అవమానించి నందుకు ఒక స్విస్ పర్యాటకుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఈ నెల 20న వెలువడగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల లూజియాన్ ఆండ్రిన్ జ్రాగ్గెన్, మౌన దినం గురించి సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేయడం ద్వారా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు దోషిగా తేలింది. అతను బస చేస్తున్న విల్లాలోని సిబ్బంది ఆంక్షల గురించి తెలియజేసినప్పటికీ ఆ సందేశాలను పోస్ట్ చేశాడని డెన్పాసర్ జిల్లా కోర్టు నిర్ధారించింది. ‘నిందితుడు చేసిన పని బాలి ప్రజలను అవమానించింది. వారి విశ్వాసాన్ని దెబ్బతీసింది.
ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది’ అని అధ్యక్ష న్యాయమూర్తి చోకోర్డా పుత్ర బుడి పాస్టిమా స్పష్టం చేశారు. ‘నిందితుడు తన చర్యలకు జవాబుదారీగా ఉండాలి’ అని ఆదేశించారు. స్థానికంగా న్యాపీ అని పిలువబడే ‘నిశ్శబ్ద దినం’ సాధారణంగా మార్చి నెలలో వస్తుంది. ఈ ఏడాది మార్చి 19 న్యాపీ పండుగ వచ్చింది. ఆ ఒక్క రోజు, నిశ్శబ్దం పాటించేలా చూసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గస్తీ బృందాలు తప్ప, ఆ ద్వీపంలోని ప్రపంచ ప్రసిద్ధ బీచ్‌లు, వీధులు జనరహితంగా ఉంటాయి.
ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేషియాలో, హిందువులు అధికంగా ఉండే ద్వీపమైన బాలిలోని విమానాశ్రయం మూసివేస్తారు. ఇంటర్నెట్ నిలిపివేస్తారు. ఈ ఆంక్షలు మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. అత్యవసర పరిస్థితులలో తప్ప, నివాసితులు, సందర్శకులు తమ ఇళ్లు లేదా వసతి గృహాల నుంచి బయటకు వెళ్లడాన్ని నిషేధించే ఆంక్షలను తాను ధిక్కరించినట్లు జ్రాగ్గెన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో గొప్పగా చెప్పుకున్నాడు.
ఆన్లైన్లో షేర్ చేసిన వీడియో క్లిప్లలో, జ్రాగ్గెన్ కెమెరా వైపు చూసి నవ్వుతూ, ఆ కార్యక్రమం సందర్భంగా ఒక బీచ్‌కు నడుచుకుంటూ వెళ్లడాన్ని వివరించాడు. ఒక వీడియోలో, అతను ఆ సంప్రదాయాన్ని ‘పిచ్చిది’ అని పిలిచి, ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని అగౌరవంగా భావించిన బాలి నివాసితులు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు అధికారులు అతని ఆచూకీ కనుగొని, కూటా బీచ్ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన లెగియాన్‌లోని ఒక విల్లాలో అరెస్టు చేశారు. ‘నేను చేసిన దానికి తీవ్రంగా చింతిస్తున్నాను. బాలి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను,‘ అని జ్రాగ్గెన్ తన వాదనలో పేర్కొన్నాడు.






