24 August, 2026 | 3:02 AM

ఫ్రాన్స్‌లో స్వామినారాయణ్ తొలి దేవాలయం

24-08-2026 12:00 AM

సెప్టెంబర్ 2 నుంచి 14 వరకు ఉత్సవాలు

ప్యారిస్, ఆగస్టు 23: ప్యారిస్‌లో తొలి బీఏపీఎస్ (బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ) హిందూ దేవాలయ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. దేవాలయాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 13 రోజులపాటు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేట్లు ఉత్సవాలు, వేడుకలను నిర్వహిస్తామని ఆ సంస్థ ఆదివారం ప్రకటించింది. ఈ దేవాలయం ప్యారిస్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న బస్సీ సెయింట్ జార్జెస్‌లో ఏర్పాటవుతుంది. సెప్టెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని, ఇందులో భారత్ నుంచి, దేశ విదేశాల నుంచి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

కాగా వెయ్యేళ్ల పురాతన పద్ధతులు, చేతితో చెక్కిన శిల్పకళ, భారత్‌లో చెక్కిన రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఆలయ నిర్మాణం భారతీయ హస్తకళ, ఫ్రెంచ్ ఆధునిక నిర్మాణ పద్ధతులను మేళవించనుంది. గోపురాలు, స్తంభాలు, శిఖరాలను సాంప్రదాయ హిందూ వాస్తుప్రకారం ఏర్పాటు చేశారు. 1970లోనే బీఏపీఎస్‌కు ఫ్రాన్స్‌లో హిందూ ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. 1995లో భూమికోసం అన్వేషణ ప్రారంభమైంది. 2017లో జార్జెస్‌లో దేవాలయం కోసం స్థలం సేకరించారు. 2021లో నిర్మాణం ప్రారంభమైంది. 2023 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ పనులను పర్యవేక్షించి ఎలా ఉండనుందో 3డీలో నమూనాను విడుదల చేశారు. కాగా బీఏపీఎస్ ప్రపంచవ్యాప్తంగా 1,300పైగా ‘స్వామినారాయణ్’ దేవాలయాలను నిర్మించింది.