calender_icon.png 7 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి 811 మందికి కేవలం ఒక వైద్యుడు

07-12-2025 01:06:24 AM

-డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి భారత్‌లో వైద్యసేవలు

-ఆల్లోపతి వైద్యులతోపాటు పెరుగుతున్న ఆయుష్ వైద్యుల సంఖ్య

-పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా ప్రకటన

-ఏటా వైద్యులు పెరుగుతున్నారే కానీ.. మెరుగైన వైద్యసేవల్లేవంటున్న నిపుణులు

-సర్కార్ దవాఖానల్లో మరిన్ని సౌలత్‌లు పెంచాలని సూచన

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశ జనాభాలో ప్రస్తుతం ప్రతి 811 మందికి కేవలం ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెం ట్ సాక్షిగా తాజాగా కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ వైద్యుల్లో అల్లోపతితో పాటు ఆయుష్, హోమియోపతి వైద్యులు కూడా ఉన్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) సిఫార్సుల ప్రకారం ప్రతి 1,000 మందికి ఒక వైద్యుడిని సిఫార్సు చేయగా, మన దేశంలో మాత్రం ఆ నిష్పత్తి 1: 811 ఉండటం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.86 లక్షల మంది అల్లోపతి వైద్యులు అందుబాటులో ఉండ గా, మరో 7.51 లక్షల మంది వైద్యులు ఆయుష్ వైద్యులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రిజిస్టర్ చేసు కున్న వారిలో 80 శాతం మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు.

వైద్యులున్నా.. సౌలత్‌లు లేవు

2014  24 మధ్య ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 నుంచి 1,28, 875కు పెరిగింది. అలాగే ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) చేసే వారి సంఖ్య 31,185 నుంచి 82,059కు పెరిగింది. కోర్సులు పూర్తి చేసి బయటకు వచ్చే వారి సంఖ్య యేటా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం తగినన్ని మౌలిక వసతులు, పరికరాలు అందుబాటులోకి రావడం లేదని వైద్యారోగ్యోశాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోందని చెప్తున్నారు.

ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వైద్యుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించకుండా, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రులు బలోపేతం చేసేందుకు, వాటికి అనుబంధంగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలంటున్నారు. దీనివల్ల వైద్య విద్య, వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

వేధిస్తున్న పడకల సమస్య

ప్రస్తుతం దేశంలో వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే విషయంలో పరిస్థితులు మెరుగుపడిన ప్పటికీ, ప్రజలకు వైద్యారోగ్యసేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే అభిప్రాయాలు వైద్య నిపుణుల నుంచి వస్తున్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య వైద్యసేవల విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉందని విస్తృతంగా మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. భారత ఆరోగ్య ప్రమాణాల ప్రకారం.. ప్రతి 1,000 మందికి రెండు ఆస్పత్రులు అందుబాటులో ఉండి, వాటిలో సరిపడినన్ని పడకలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ లక్ష్యం కేవలం 27శాతం నెరవేరిందని గణాంకాలు చెప్తున్నాయి.