4 May, 2026 | 12:28 AM

ఆపరేషన్ గాజా

23-08-2025 12:00 AM

అనాథగా మారిన గాజాను ఇజ్రాయెల్ స్వాధీనపర్చుకోవడమే ఇక మిగిలి ఉంది. రెండు నెలల్లో నెతన్యాహు ఆ పని కూడా పూర్తి చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమ దేశాలు కూడా కాదు.. కూడదంటున్నా, గాజాను ఆక్రమించుకునేందుకు కొత్త ప్రణాళికతో సైన్యం ముందుకు కదిలితే హమాస్ బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు పోతాయని టెల్ అవీవ్‌లో పెద్ద ఎత్తున ఇజ్రాయిలీలు నిరసన తెలిపినా నెతన్యాహు పట్టించుకోవడం లేదు.

గాజా ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే అజెండాగా ముందుకు వెళ్తున్నారు. 60 వేల మంది రిజర్వ్ సైనికులతో పాటు పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను గాజాలో దింపడం మొదటి దశగా సఫలీకృతం కావడానికి గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటికే అల్లకల్లోలమైన గాజా వాసులు తాజా దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు.

తాజా బాంబింగ్‌లో కనీసం 52 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. యుద్ధం అంతానికి హమాస్ వెంటనే బందీలను విడుదల చేయాలని, తమ షరతులన్నింటికి అంగీకరించాలని నెతన్యాహు చివరి హెచ్చరిక చేశారు. అరబ్ దేశాల మధ్యవర్తిత్వంతో, కాల్పుల విరమణకు తాము సమ్మతిస్తున్నట్టు ఇటీవలే హమాస్ ప్రకటించింది. అయినా, హమాస్ సంస్థను పూర్తిగా తుడిచి వేయడం, గాజాలో తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న నెతన్యాహు అందుకు తన క్యాబినెట్ ఆమోదం కూడా పొందారు.

గాజా ఉత్తర ప్రాంతాల నుంచి పాలస్తీనీయులు దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లేలా చూడాలని అంతర్జాతీయ సహాయ బృందాలను, వైద్యాధికారులను ఇజ్రాయిలీ మిలటరీ కోరుతోంది. 75 శాతం గాజా భూభాగాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకున్నామని చెబుతున్న ఇజ్రాయెల్, ఇంకా మిగిలి ఉన్న హమాస్ మిలిటెంట్ల స్థావరాలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ తాజా దాడులకు తల్లిడిల్లుతున్న  వందలాది మంది పాలస్తీనీయులు గురువారం నాడు నిరసన ప్రదర్శన జరిపారు. ‘ఈ మరణాలు వద్దు.. ఈ విధ్వంసం వద్దు.. మేం ఇక్కడి నుంచి వలస వెళ్లం.. యుద్ధం ఆపండని’ వారు నినదించారు. వారి బాధను, గాజాలో నిత్యకృత్యమైన ఆకలిచావులను ఇటు ఇజ్రాయెల్, అటు ఆ దేశానికి అండగా ఉన్న అమెరికా పట్టించుకున్న దాఖలాలు లేవు.

దాదాపు 20 లక్షల మంది పాలస్తీనీయుల్లో 90 శాతం మంది గాజా నగరంలోనే ఉంటారు. వారంతా ఇప్పుడు చెల్లా చెదురయ్యారు. ఇజ్రాయెల్ రెండేళ్లుగా జరుపుతున్న దాడుల్లో గాజా 80 శాతం మరుభూమిగా మారింది. ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్న టెంట్లలో బతుకీడుస్తున్నారు. పౌష్ఠికాహార లోపంతో పసిపిల్లలు ఎముకల గూళ్లుగా మారారు. అనేక మంది ఆకలితో అల్లాడి ప్రాణాలు విడుస్తున్నారు.

సహాయ బృందాలు పంచే ఆహారం తీసుకుందామని గూమికూడిన పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మిలటరీ జరిపిన కాల్పుల్లో, ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,760 మంది చనిపోయారు. అక్టోబర్ మొదటి వారం నాటికి గాజా ప్రాంతాన్నంతా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రణాళికలు రచించుకొన్న ఇజ్రాయెల్ ఇంకెన్ని దాడులు చేస్తుందో, ఇంకెంత మంది పాలస్తీనీయుల ప్రాణాలు తీస్తుందో ?