ప్రకృతి పండుగ పొలాల అమావాస్య
పొలాల అమావాస్యకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగ రైతాంగానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఆగస్టు నెల మధ్య భాద్రపద మాసానికి ముందు వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. దీనినే పొలాల అమావాస్య, పొలేల అమావాస్య అని కూడా పిలుస్తారు. రైతులు తమ పశువులకు విశ్రాంతినిచ్చి వ్యవసాయానికి, వాటి సేవకు కృతజ్ఞతలు తెలుపుతారు.
ఇది సంతానం కోసం చేసే వ్రతంగా కూడా పరిగణించబడుతుంది. పోలాల అమావాస్య రోజున ప్రధానంగాఎడ్లను పూజించడం, పొలాలను పూజించడం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయం, పొలాలను దుక్కి దున్నే ప్రక్రియలో ఎద్దు పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకు కృతజ్ఞతాభావంగా రైతులు తమ ఎడ్లను పూజిస్తారు. ఆరోజు ఎడ్లను శుభ్రంగా కడిగి వాటిని అలంకరణ చేసే కొత్త కట్టెలు కట్టి అందంగా ముస్తాబు చేస్తారు.
పసుపు కుంకుమలు పెట్టి పల్లీలు, చక్కరపొడి, గడ్డి, పానకం వంటివి పెడతారు. ఈ రోజు రైతులు పొలాలకు వెళి ్లకొత్తపంట, తోటకూర, జొన్న, వేరుశెనగ దినుసులు తీసుకొని పూజిస్తారు. పొలంలో భూమికి నైవేద్యం సమర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఈ పండుగను ‘రైతుల దివాలి’ అని కూడా అంటారు. ఇది పంటలు పండే సమయం దగ్గరలో ఉండే ఉత్సహం.
ఎద్దులు అన్నదాతలకు సహచరులు కాబట్టి వాటికి గౌరవం తెలిపే రోజు. పంటలపై కీటకాలు, దోషాలు రాకుండా ఉండాలని, భూమాత కరుణతో మంచి దిగుబడులు రావాలని ప్రార్థిస్తారు. ప్రకృతిని, ఎడ్లను, భూమిని పూజించే సంప్రదాయం ఇందులో ప్రతిఫలిస్తుంది. పొలాల అమావాస్య అనేది రైతు జీవితానికి, వ్యవసాయానికి, ప్రకృతికి, జంతువుల అనుబంధానికి ప్రతీక. ఇదే రోజున రైతు కుటుంబాలు తమ తమ ఇళ్లలో ఇష్ట దైవమైన పోచమ్మను ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేకమైన పిండి, మాంసాహారం వంటకాలు కూడా నైవేద్యం పెట్టి ఆరాధిస్తారు.
తమ కుటుంబాలను, గ్రామ ప్రజలను ఆరోగ్యవంతంగా సుభిక్షంగా ఉంచాలని, పంటలు విస్తృతంగా పండాలని గ్రామదేవతలను మనసారా వేడుకుంటారు. అయితే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశంలో వ్యవసాయంలోనూ కొత్త సాంకేతికత పుట్టుకొచ్చింది. ట్రాక్టర్లు ఉపయోగించడం వల్ల ఎద్దుల వినియోగం చాలా తగ్గిపోయింది. సన్న కారు రైతులకు తమ ఎద్దుల నిర్వహణ కష్టంగా మారడంతో కళేబరాలకు తరలిస్తుండటం బాధాకరం.
ఉమాశేషారావు, కామారెడ్డి






