3 August, 2026 | 1:35 PM

మున్సిపాలిటీల్లో విలీనంపై వ్యతిరేకత!

24-08-2024 12:19 AM
  1. శివారు గ్రామాల విలీనంపై ముగిసిన గ్రామసభలు 
  2. వ్యతిరేకించిన మెజార్టీ గ్రామాల ప్రజలు 
  3. వచ్చే నెలలో గెజిట్ నోటిఫికేషన్ జారీ? 
  4. ఆశలు వదులుకున్న రాజకీయ నేతలు

పటాన్‌చెరు, ఆగస్టు 23: ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, అవతల గల గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు నిర్ణయించింది. శివారు గ్రామాల విలీన ప్రక్రియలో భాగం గా శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని 11 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. పటాన్‌చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనాపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి, అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్పూర్, దాయర గ్రామాలను అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

విలీనంపై ప్రభుత్వం ఏర్పరిచిన సబ్ కమిటీ 11 గ్రామాల్లో సభలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మెజార్టీ గ్రామసభల్లో ప్రజలందరూ ఏకగ్రీవంగా విలీన ప్రక్రియను వ్యతిరేకించారు. పంచాయతీలుగా ఉన్నప్పుడే ప్రజలకు సుపరి పాలన అందించడం సాధ్యమవుతుందని, పురపాలికలోకి విలీనం చేస్తే అభివృద్ధి కుంటుపడటంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామసభల తీర్మానం అనంతరం గ్రామాల విలీనంపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. తదనంతరం పంచాయతీరాజ్ శాఖ విలీన గ్రామ పంచాయతీలో డీనోటిఫై చేయడంతో విలీన ప్రక్రియ ముగియనుంది.

కనుమరుగు కానున్న అమీన్‌పూర్ మండలం

అమీన్‌పూర్ మండల పరిధిలోని 8 గ్రామపంచాయతీల్లో 6 గ్రామపంచాయతీలు అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. మిగిలిన జానకంపేట, వడక్ క్పల్లి గ్రామాలను పటాన్‌చెరు లేదా జిన్నారం మండలంలో కలిపే అవకాశాలు ఉన్నాయి.  2018లో రాష్ట్ర ప్రభుత్వం నూత న మండలాల ఏర్పాటులో భాగంగా ఉమ్మ డి పటాన్‌చెరు మండలంలోని ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిసి అమీన్‌పూర్ మండలం ఏర్పడింది. కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే తిరిగి మున్సిపాలిటీలో విలీనం కావడంతో అమీన్‌పూర్ మండలం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 

8 గ్రామాలతో పటాన్‌చెరు మండలం.. కొత్త మున్సిపాలిటీగా ఇస్నాపూర్?

విలీన ప్రక్రియలో పటాన్‌చెరు మండల పరిధిలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇస్నాపూర్ కేంద్రంగా ఇస్నాపూర్, చిట్కుల్, పాశ మైలా రం, నందిగామ, బచ్చుగూడెం, రామేశ్వరం బండ గ్రామాలతో ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మిగిలిన భానూర్, కేసారం, రుద్రారం, లకడారం, ఇంద్రేశం, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు గ్రామాలతో పటాన్‌చెరు మండలం కొనసాగనుంది. 

రాజకీయ నేతల్లో గుబులు

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకునేందుకు గత రెండు సంవత్సరాలుగా ప్రజలతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్న రాజకీయ ఆశావాహులకు విలీన ప్రక్రియ గట్టి షాక్ ఇచ్చింది. ప్రధానంగా అమీన్‌పూర్ మండల పరిధిలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్  పదవుల కోసం సుమారు 100మందికి పైగా ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన పండు గలతోపాటు వివిధ సందర్భాల్లో విరాళాలు అందిస్తూ. సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. గ్రామాల విలీన ప్రక్రియ వారి ఆశలపై నీళ్లు చల్లింది. 

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో..

మేడ్చల్: మున్సిపాలిటీల్లో తమ గ్రామాలను విలీనం చేయొద్దని శుక్రవా రం జరిగిన గ్రామసభలలో మేడ్చల్ మం డలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్మానించారు. పూడూరు, గౌడవెల్లి, రాయలా పూర్ గ్రామాలను మేడ్చల్ మున్సిపాలిటీలో కలుపొద్దని, గ్రామ పంచాయతీలు గానే కొనసాగించాలని తీర్మానించారు. అవసరమైతే చుట్టు పక్కల గ్రామాలతో పూడూరు మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలన్నారు.

మేడ్చల్ లో విలీనం చేయడాన్ని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీవో సునీత, పంచాయతీ కార్యదర్శి మధు పాల్గొన్నారు. మునీరాబాద్ గ్రామాన్ని గండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయా లన్న ప్రతిపాదనపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి, రింగురోడ్డు దాటి మున్సిపాలిటీకి ఎలా వెళ్తామని ప్రశ్నించారు.