calender_icon.png 9 February, 2026 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాసిన విపక్ష మహిళా ఎంపీలు

09-02-2026 02:28:41 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విపక్ష మహిళా ఎంపీలు లేఖ రాశారు.  తీవ్ర వేదనతో రాజ్యాంగ బాధ్యత స్ఫూర్తితో లేఖ రాస్తున్నట్లు మహిళా ఎంపీలు పేర్కొన్నారు. తమ నిరసన ప్రధాని నరేంద్ర మోదీకి ముప్పు కలిగించిందనే ఆరోపణలను వారు ఖండించారని, ప్రతిపక్ష మహిళా సభ్యులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుడు, పరువు నష్టం కలిగించేవి అని ఎంపీలు లేఖలో వాపోయారు. ప్రభుత్వం ప్రతిపక్షాల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ లేఖకు ఎంపీ ఎస్. జోతిమణి నాయకత్వం వహించగా, అనేక మంది మహిళా పార్లమెంటేరియన్లు సంతకం చేశారు. 

గత వారం లోక్‌సభలో అపూర్వమైన అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. ఆ సమయంలో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి తన నిర్ణీత సమాధానాన్ని ఇవ్వలేకపోయారని, గత 22 ఏళ్లలో దిగువ సభలో ఒక ప్రధానమంత్రి చర్చకు సమాధానం ఇవ్వలేకపోవడం ఇది మొదటిసారి అని వారు ఎద్దేవా చేశారు. పదేపదే సభ వాయిదా పడుతున్నప్పటికీ, ఆ తర్వాత ధన్యవాద తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదించబడింది. ప్రధానమంత్రి మోదీ ప్రసంగించాల్సి ఉన్నప్పుడు, కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి 'అనూహ్య సంఘటనలకు' పాల్పడే అవకాశం ఉందని తనకు 'విశ్వసనీయ సమాచారం' అందిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. 

ఆయన ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను కూడా విమర్శించారు. ఆ సమయంలో సభకు రావద్దని తాను ప్రధానమంత్రికి సలహా ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ స్పీకర్ గా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్న మహిళ ఎంపీలు, అధికార పక్ష ఒత్తిడితో నిరాధార ఆరోపణలు చేశారని లేఖలో వెల్లడించారు. ప్రధాని మోదీ జవాబుదారీగా ఉండాలంటే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభకు గైర్హాజరు కావడం ఎంపీల బెదిరింపులతో కాదు.. భయంతో తీసకున్న నిర్ణయమని కాంగ్రెస్ మహిళ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రధానికి లేదని, అధికార పార్టీ నుంచి స్పీకర్ ఒత్తిడికి గురవుతున్నారని, ఆయన లోక్ సభకు నిష్పక్షపాత సంరక్షకుడిగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రయత్నంలో స్పీకర్ కు అండగా నిలబడి సంపూర్ణ మద్దతిస్తామని ఎంపీలు తెలిపారు. రాజ్యాంగ నియమాలు నిలబెట్టన వ్యక్తిగా చరిత్ర స్పీకర్ ను గుర్తుంచుకోవాలని, ఒత్తిడికి లొంగిపోయిన వ్యక్తిగా చరిత్ర స్పీకర్ ను గుర్తుంచుకోకూడదని మహిళా ఎంపీలు హితవు పలికారు.