ఆశల పల్లకీలో ఆశావాహులు
- రిజర్వేషన్ల కోసం నాయకుల ఎదురుచూపులు..
వర్గపోరుతో బేజారుతున్న కాంగ్రెస్, బిజెపి..
తాండూర్ మున్సిపల్‌లో వేడెక్కుతున్న రాజకీయం
తాండూరు, జనవరి 9, (విజయ క్రాంతి): ఈ నెల 10 తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ జాబితా ముసాయిదా తప్పుల తడకగా ఉందంటూ బిజెపి కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ఎంఐఎం సిపిఐ తదితర పార్టీలు అభ్యం తరం వ్యక్తం చేశాయి.
జాబితా సరి చేసేందుకు సంబంధిత అధికారులు ముప్పు తిప్పల పడుతున్నారు. ఇక 36 వార్డుల్లో జరగనున్న ఎన్నికలకు రిజర్వేషన్లు ఏ విధంగా వస్తాయో..ఎక్కడ పోటీ చేయాలో.. ఎంత ఖర్చు అవుతుందో నని ఆయా పార్టీల నాయకులు లెక్కలు కడుతూ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్ మరియు బిజెపి లో వర్గ పోరు జోరుగా సాగుతోంది, తాండూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా పనిచేసిన మహేందర్ రెడ్డి ప్రభావం పార్టీలో బాగా పట్టుంది. పార్టీ మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆంటీ ముట్టనట్లు ఉంటున్నారు.
ఆయన అనుచరులు చైర్మన్ పదవి తో పాటు కౌన్సిలర్ టికెట్లను తీవ్ర స్థాయిలో ఆశిస్తున్నారు. టికెట్ మాకే వస్తుంది...మేమే పోటీలో ఉంటున్నాం... అంటూ పలువురు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులు వార్డుల్లో ప్రచా రం సైతం నిర్వహిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనుచరులు సైతం పార్టీ తమకే పోటీ చేసేందుకు అవకాశం ఇస్తుందని ఎమ్మెల్యే నుండి తమకు హామీ కూడా వచ్చిందని...తప్పనిసరిగా మేమే పోటీలో ఉంటామని...
చెబుతూ ఉండడంతో వార్డులోని ప్రజలు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఇంకా మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కు నియోజకవర్గంలోనే అన్ని వర్గాల ప్రజల్లో మంచి పట్టు ఉంది. అంతేకాదు ఇతర పార్టీల నాయకులతో అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా మారింది. అతను స్కెచ్ వేశాడు అంటే చాలు ప్రత్యర్థి పార్టీలు బేజారు కావాల్సిందే. అతని ఆశీర్వాదం కోసం పార్టీ నాయకులు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక మరో ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ సైతం వర్గ పోరుతో కొట్టుమిట్టాడుతుంది. గతంలో రెండు పర్యాయాలు మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసిన ఘనత ఉంది. పార్లమెంట్ ఎన్నిక సమయంలో తాండూర్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి దాదాపు 8 వేల ఓట్ల ఆదిక్యం వచ్చింది. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది.
జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రహ్లాద రావు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కొందరు నియోజకవర్గం నాయకులు అంటి.. అంటనట్లు వ్యవహరిస్తుండడంతో గ్రూప్ రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. బిజెపికి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా..నాయకులు సమిష్టిగా ఉండలేక ఓట్లుగా మలుచుకోలేకపోతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
గత మున్సిపల్ ఎన్నికల్లో ఏడుగురు కౌన్సిలర్లుగా విజయం సాధించి పట్టు బిగించారు. ఇక టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని పోటీ చేసేందుకు నాయకులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఈసారి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ పై టిఆర్‌ఎస్ జండా ఎగురవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవి బీసీ లేదా జనరల్ రిజర్వేషన్ అయితే టిఆర్‌ఎస్ నుండి దీపా నర్సింహులు, నరేందర్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
బిజెపి నుండి సాహు శ్రీలత.. మరియు ప్రముఖ వ్యాపారవేత్త సతీమణి పోటీలో ఉంటారని సమాచారం. ఇంకా కాంగ్రెస్ పార్టీలో నీరజ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, రవి గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ కుమారుడు మహిపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక మరి కొంతమంది ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్...పట్టు సాధించేందుకు బిజెపి, టీఆర్‌ఎస్ పార్టీలు తీవ్ర స్థాయిలో పోటీ పడడం తాండూర్ మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.




