1 May, 2026 | 4:06 AM

మార్కెట్ ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు తరలింపు

01-05-2026 12:39 AM

అధిక ధరకు అమ్మేందుకు అక్రమంగా రవాణా

విచారణకు ఆదేశించిన కలెక్టర్   

నివేదిక ఆధారంగా చర్యలు        

పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు 

కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

తుంగతుర్తి, ఏప్రిల్ 30: రైతులు ధాన్యం అమ్మకాల్లో ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రామాల్లో ఐకెపి కేంద్రాలు, సొసైటీ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు తీసుకువచ్చిన  ధాన్యాన్ని ఆరబెట్టి, తేమశాతం చూసిన అనంతరం నిర్వాహకులు కాంటాలు పెట్టి, మిల్లుకు ఎగుమతి చేసి  సకాలంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

ఇంతవరకు బాఘనే ఉన్నా.. కొంతమంది అక్రమార్కులు మాత్రం వక్రబుద్ధితో ఈ ప్రక్రియను తనకు అనుకూలంగా మలుచుకొని స్వార్థపూరితంగా స్వప్రయోజనాలను పొందేందుకు అడ్డదారులను తొక్కుతున్నారు. ఇటువంటి సంఘటన మండలంలోని గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇటీవల వెలుగులోకి రాగా జిల్లా కలెక్టర్ పూర్తి వివరాలను సేకరించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు.

మార్కెట్ నుండి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలింపు : 

జిల్లాలోని  తిరుమలగిరి మార్కెట్ నుండి తక్కువ ధరకు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసిన కొంతమంది చిరు వ్యాపారస్తులు, అక్రమ సంపాదన కోసం డీసీఎం ద్వారా ధాన్యం బస్తాలు తీసుకొని వచ్చి మండలంలోని గొట్టిపర్తిలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యము కొనుగోలు కేంద్రంలో పోసి ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జరిగిన సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు.

నివేదిక ఆధారంగా చర్యలు 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం ఇదే విషయం పై పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమగ్ర నివేదికను కలెక్టర్ కు అందజేశారు. గత సంవత్సరంలో కూడా మండలంలో కొన్ని సెంటర్ లలో ఇదే తంతు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కలెక్టర్ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

 నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు తీసుకున్నారు. దీనిలో భాగంగా తుంగతుర్తి తహశీల్దార్ దయానంద్, తిరుమలగిరి తహశీల్దార్ హరి ప్రసాద్, ఎంపిడివో శేషు కుమార్, మండల వ్యవసాయ అధికారి తుంగతుర్తి రమేష్ బాబు, గొట్టిపర్తి ఏఈఓ జోత్స్న, తుంగతుర్తి ఏపిఎం ఎం.యాదమ్మలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.                    

 క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వేడుకోలు 

 ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి, వివిధ మార్కెట్ కేంద్రాల నుండి కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిలో ఐకెపి కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కూడా ఉన్నారని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వివిధ పార్టీ నాయకులు, రైతులు అధికారులను వేడుకుంటున్నారు.