15 April, 2026 | 9:57 AM

అనాథ బాలకార్మికులం!

12-06-2025 12:00 AM

నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం

కామాంధులు తిని వదిలేసిన, చిదిమేసిన 

ఎంగిలి విస్తరాకులం మేము

మేము అనాథ బాలకార్మికులం!

బతుకు కోసం, మెతుకుకోసం 

పోరాటం చేస్తున్న

ఆరవ పంచభూతమైన

ఆకలికి వారసులం మేము

మేము అనాథ బాలకార్మికులం!

రోజంతా మస్తు పని చేస్తాం...

కడుపును పస్థులు ఉంచుతాం...

వెట్టిచాకిరి చేస్తున్న 

భావిభారత పౌరులం మేము 

మేము అనాథ బాలకార్మికులం!

సమాజంలో తన్నులు తిట్లు 

అవార్డులుగా పొందిన

ఉదయిస్తున్న సూర్యులం మేము

మేము అనాథ బాలకార్మికులం!

ఇరానీ హోటల్ నుంచి 

ఇటుక బట్టీల వరకు 

అంతటా కట్టు బానిసలమై 

జీవనోపాధి కోసం

బాల్యాన్ని బలి పశువులుగా చేస్తూ...

మోములో మోదమంటే 

ఎరగనోల్లం మేము

మేము అనాథ బాలకార్మికులం!

మేము అనాథ బాలకార్మికులం!

బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం!

బంగరు భవితకు బాటలు వేద్దాం!!         

మంజుల పత్తిపాటి