6 May, 2026 | 10:59 AM

మన తెలంగాణ తల్లి బహుజనుల అమ్మ

10-12-2024 02:32 AM

నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం

  1. పదేళ్లపాటు వివక్షకు గురైన తెలంగాణ తల్లి
  2. ఒక కుటుంబం కోసం రాష్ట్రాన్ని సాధించలేదు
  3. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం
  4. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణపై రాబోయే రోజుల్లో శాసనసభలో విధివిధాలను ప్రకటించి, వాటిపై చర్చించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని స్పష్టంచేశారు.

సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

తొలుత రాష్ట్ర గీతం గేయ రచయిత అందెశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్, తెలంగాణ తల్లి శిల్పి రమణారెడ్డిని సీఎం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. మొదటి ఏడాది పూర్తి చేసుకుంటు న్న సందర్భంలో అందెశ్రీ, ప్రొఫెసర్ గంగాధర్, శిల్పి రమణారెడ్డిని సన్మానించుకోవ డం ద్వారా కవులు, కళాకారులకు సముచిత గౌరవాన్ని ఇచ్చామని చెప్పారు. 

తెలంగాణ తల్లికి వివిధ రూపాలు 

ఉద్యమ సమయంలో ఆలే నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్, ఇతర ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల ఆలోచన, విధివిధానాల ప్రకారం పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చారని చెప్పారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉండాలని నిర్ణయించలేదన్నారు. బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్ష మేరకు తండాల్లో, గూడే ల్లో,  పల్లెల్లో కనిపించే అమ్మే తెలంగాణ తల్లి రూపమని చెప్పారు. తెలంగాణ తల్లిని చూస్తే తన కన్నతల్లి ప్రతిరూపం స్ఫురిస్తోందన్నారు. 

పదేళ్లు వారి గురించే ఆలోచన  

భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే వస్తుందని సీఎం చెప్పారు. ౪ కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దంపాటు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించుకోవడం గర్వకారణమన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో మన  సంస్కృతిపై దాడి చేయడమే కాదు, అవహేళ చేశారని, అవమా నించిన సందర్భాలను చూశామన్నారు.

ఆ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులు అమరులై సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ తల్లిని గౌరవించుకుంటామని అందరం అనుకున్నామన్నారు. కానీ పదేళ్ల పాటు ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ.. వారి గురించి మాత్రమే ఆలోచించించారని, ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని మండిపడ్డారు.  ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డక  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తమ సహచర మంత్రులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

ఆకాంక్షలకు విరుద్ధంగా.. 

నాడు తెలంగాణ యువకులు, ఉద్యమకారులు తమ వాహనాలపైనే కాదు, గుండెలపై కూడా ‘టీజీ’ అని రాసుకున్నారని గుర్తుచేశారు. కానీ నాటి ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వాహనాలకు ‘టీజీ’కి బదులుగా టీఎస్‌గా నామకరణం చేసి వారి ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు.

అందుకే తమ సర్కారు ఏర్పడిన వెంటనే ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగునంగా ‘టీజీ’ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చామన్నారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపి, ఉద్యమ కారులకు స్ఫూర్తినిచ్చి, రాష్ట్ర సాధనలో ఎంతో మంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ను గత సర్కారు రాష్ర్ట గీతంగా ఆవిష్కరించలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందెశ్రీని సంప్రదించి వారి ఆలోచనల మేరకు రాష్ర్ట గీతంగా ప్రకటించుకోవడమే కాదు, రాష్ర్ట పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సంన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే మధుర జ్ఞాపకమన్నారు. 

ఉద్యమం కోసం సర్వం ఒడ్డిన తొమ్మిది మందికి గుర్తింపు

తెలంగాణ కోసం సర్వం కోల్పోయి, ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోక ఇబ్బంది పడుతున్న ౯ మంది కవులు, ప్రముఖలను గుర్తించి, గౌరవించి.. వారిని ఆదుకోవాలని నిర్ణయించినట్టు సీఎం పేర్కొన్నారు.

గూడ అంజయ్య, ప్రజా యుద్ధనౌక గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావును ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, రూ.కోటి నగదు, తామ్ర పత్రం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 

తెలంగాణ హృదయ చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహరూపంలో ఆవిష్కరించుకోవడంపై సీఎస్ శాంతి కుమారి హర్షం వ్యక్తం చేశారు.  

తలెత్తుకునేలా విగ్రహం: డిప్యూటీ సీఎం భట్టి 

ప్రజలు తలెత్తుకునేలా,  అమ్మ, అక్క, నానమ్మలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.   దశాబ్దాలపాటు సాగిన తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్న సోనియా గాంధీ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధం గా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరంతో రాష్ర్ట ఆవిర్భావానికి సంబంధించిన ప్రకటన చేయించిన రోజు ఇదని గుర్తుచేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై భట్టి కౌంటర్ ఇచ్చారు. 56 వేల ఉద్యోగాలు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని స్పష్టంచేశారు.

కార్యక్రమంలో స్పీకర్ గడ్డంప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్, మేయర్ విజయలక్ష్మి, సిరిసిల్ల రాజయ్య, కే కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాయం వెంకటేశ్వర్లు, మందుల సామేల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ కోసం తెలంగాణ తెచ్చుకున్నం 

తాము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చొని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తమ నిర్ణయాలు వాళ్ల రాజకీయ పార్టీ మనుగడకు ప్రమాదకరంగా మారుతాయని అనుకోవచ్చన్నారు. కానీ ఒక కుటుంబం కోసమో, ఆ రాజకీయ పార్టీ కోసమో తెలంగాణను సాధించుకోలేదని స్పష్టంచేశారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామిక పరిపాలన కోసం, బహుజనుల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు.

అలాంటి అవమానాలు ఇక మీదట ఉండొద్దన్న ఉద్దేశంతో టీజీ మార్చడం, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నట్లు చెప్పారు. ఇక మీదట ప్రతి ఏడాది ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలను ప్రభుత్వ పరంగా గ్రామ, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించుకోనున్నట్లు వివరించారు.

నిండైన రూపం 

ఎవరు కాకతీ! ఎవరు రుద్రమ ! ఎవరు రాయలు ! ఎవరు సింగన ! అంతా నేనే ! అన్నీ నేనే ! అలుగు నేనే ! పులుగు నేనే ! వెలుగు నేనే ! తెలుగు నేనే!’ అని దాశరథి చెప్పినట్లుగా.. తెలంగాణ పౌరుషాన్ని మాతృత్వపు మమకారాన్ని, త్యాగాన్ని, సబ్బండ వర్గాలు ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం. అందరం దీనికి సాక్షీభూతులు కావడం అదృష్ణం

- సీఎస్ శాంతి కుమారి

ప్రముఖులకు నజరానా


గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావులకు ఫ్యూచర్ సిటీలో ౩౦౦ గజాల స్థలం, రూ.కోటి నగదు, తామ్రపత్రం.       

 సీఎం రేవంత్‌రెడ్డి

ఆత్మగౌరవ ప్రతీక

తెలంగాణ తల్లి విగ్రహం కేవలం విగ్రహం మాత్రమే కాదు.. తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రతీక. విగ్రహ పీఠంలోని నీలం వర్ణం ‘గోదా వరి, కృష్ణమ్మలు తల్లీ నిను తడపంగ..’ అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జల దృశ్యానికి ప్రతీక. ఆకుపచ్చ వర్ణం.. పచ్చని నేలల్లో పసిడి సిరులు పండంగ అన్న సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతం. ఎరుపు వర్ణం.. మార్పునకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం.. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. 

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

కలెక్టరేట్లలో విగ్రహాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, మండల 

కార్యాలయాల్లో  అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుపై 2009 డిసెంబర్ 9న వెలువడిన ప్రకటన చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తేదీని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోనియాగాంధీ జన్మదినం రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ముదావహం. 

 మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

చర్చకు అవకాశం

తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో ఎప్పుడూ అధికా రికంగా ఏర్పాటు చేయలేదు. విగ్రహం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శాసనసభలో చర్చకు అవకాశం ఇస్తున్నాం. ప్రతిపక్షాలు తమ గళాన్ని వినిపించాలని కోరుకుం టున్నాం. ఈ వేడుక రోజున బీఆర్‌ఎస్ సభ్యులు, ఆ పార్టీ అధినేత సభకు రాకపోవడం సరికాదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణపై సోనియా గాంధీ విడుదల చేసిన ప్రకటనకు గుర్తుగా వేడుక నిర్వహిస్తున్నాం. 

 మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్‌బాబు

కలెక్టరేట్లలోనూ తెలంగాణ తల్లి విగ్రహాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లోనూ  అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై 2009 డిసెంబర్ 9న వెలువడిన ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. ఈ తేదీని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి

సాకులతో బీఆర్‌ఎస్ సభ్యుల గైర్హాజరు..

తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో ఎప్పుడూ అధికారికంగా ఏర్పాటు చేయలేదని శాసనసభ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. విగ్రహం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ వేడుక రోజున బీఆర్‌ఎస్ సభ్యులు, ఆ పార్టీ అధినేత సభకు రాకపోవడం సరికాదన్నారు.

అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి.. సాకులతో సభకు రాకుండా పోయారని, భేషజాలు, రాజకీయాలను పక్కన పెట్టి సభ్యులందందరూ సభకు రావాలని తాము కోరుకున్నామన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఎదురైన ప్రొటోకాల్ సమస్యపై స్పీకర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణపై సోనియా గాంధీ విడుదల చేసిన ప్రకటనకు గుర్తుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుక నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

విగ్రహాన్ని చూస్తే మా నానమ్మ గుర్తుకు వచ్చింది..

తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినప్పుడు మా నానమ్మ, అమ్మమ్మ  గుర్తొచ్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబురపడ్డారు. పట్టుదల, తెగింపునకు ప్రతిరూపాలు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు అని కొనియాడారు.

తాను కూడా ఉస్మానియా వర్సిటీ విద్యార్థినవడం గర్వంగా ఉందన్నారు. 2009 డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన విడుదలైందని గుర్తుచేశారు. అనంతరం జరిగిన పరిణామాలపై నాటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఆమోదానికి నోచుకుందన్నారు.

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

గత ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందా ?

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క గుర్తుచేశారు. తాము ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఇక్కడి ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవనం, తల్లి ఆశీర్వచనం ఉన్నాయని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోదరి కవితకు దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చినట్లుగా, వారు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను కనీసం రాష్ట్ర గీతంగా చేయాలని ఆలోచన కూడా ఆ ప్రభుత్వా రాలేదని మండిపడ్డారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ గుర్తింపును బీఆర్‌ఎస్ శ్రేణులు టీజీగా ప్రకటించాయని, కానీ.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌గా మార్చిందని గుర్తుచేశారు. నాడు మారుమాట్లాడడని బీజేపీ ఇప్పుడెందుకు రంకెలు వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ తమ ఊపిరి అని చెప్పుకొని, ఆ పేరుతో  అధికారంలోకి వచ్చి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడా సోయి ఎటు పోయిందని ప్రశ్నించారు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క

టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే పార్టీ కథ ముగిసింది 

టీఆర్‌ఎస్ అనే పార్టీ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందని, ఆ పార్టీతో ప్రజలు బంధం తెంపుకొన్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఓసారి నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారని గుర్తుచేశారు.

ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిన రోజు 4 కోట్ల మంది ప్రజల కోరిక నెరవేరిన రోజు అని అభిప్రాయపడ్డారు. ఇదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పైగా అసెంబ్లీకి రాకుండా నిరసనలు తెలపడం దారుణమని దుయ్యబట్టారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అసలైన తెలంగాణవాదులకు ప్రాధాన్యం..

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాలు బీఆర్‌ఎస్‌కు చెందినవని, ఆ ప్రభుత్వం ఏనాడూ అధికారికంగా విగ్రహ ఆవిష్కరణ చేయలేదని రవాణా, బీసీ  సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి ఓ వ్యక్తికి, లేదా ఒక కుటుంబానికి పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రాచరికపు పోకడలు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామన్నారు. అసలు సిసలైన తెలంగాణవాదులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ చిహ్నం మార్పుపైనా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రానికి అధికారిక గేయం లేకుంటే తమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

మంత్రి బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ 

బీజేపీ తలుచుకుంటే ముందే రాష్ట్రం వచ్చేది..

జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కూడా బలంగా ఉండేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తుచేశారు. బీజేపీ తలచుకుంటే అప్పుడే రాష్ట్రం ఏర్పడేదని, కానీ బీజేపీ ఆ పని చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. పార్టీ తరఫున గొప్ప త్యాగం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ప్రతిఒక్కరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు.

ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

సోనియాగాంధీ వల్లే తెలంగాణ

తెలంగాణ ఏర్పాటుకు కారణం సోనియాగాంధీ అని, ఆమెను రాష్ట్రప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుటుంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చేందుకు ఆమె ఎంతో చొరవ చూపారని కొనియాడారు. ప్రత్యే క రాష్ట్రం కోసం టీపీసీసీ నాడు శ్రీకృష్ణ కమిషన్‌కు వెయ్యి పేజీల నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణనే టీపీసీసీ ప్రతిపాదించిందన్నారు. ఈనెల9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపట్టడం ఆనందాన్నిచ్చిందన్నారు. 

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి