6 May, 2026 | 11:52 AM

గ్రూప్ 2 పరీక్ష వాయిదా కుదరదు

10-12-2024 02:32 AM

తేల్చి చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో గ్రూప్2 పరీక్షలను వాయిదా వేసేందుకు ఉత్తర్వులు జారీచేయబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకే రోజు గ్రూప్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది.

ఈ నెల 15, 16 తేదీల్లో జరుగునున్న గ్రూప్ పరీక్షలను వాయిదా వేసేందుకు వీలుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆర్ జ్యోతి, వేర్వేరు జిల్లాలకు చెందిన మొత్తం 23 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్  సోమవారం విచారణ చేపట్టారు. ఇప్పటికే గ్రూప్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగినందున ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని న్యాయమూర్తి వెల్లడించారు.

గ్రూప్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ నవంబరు 25న సర్వీస్ కమిషన్‌కు వినతి పత్రం అందజేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,951 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించనుందని, అదేరోజు గ్రూప్ రెండో పేపర్ పరీక్ష జరగనుందని చెప్పారు. పలువురు అభ్యర్థులు గ్రూప్2తోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు కూడా హాజరవుతున్నారని, అభ్యర్థులు రెండు పరీక్షలను రాసేందుకు వీలుగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

టీజీపీఎస్సీ న్యాయవాది వాదిస్తూ.. గ్రూప్2 పోస్టులు 783 లకుగాను 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులు హాల్‌టికెట్లను తీసుకున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణకు కేంద్రాలతోపాటు ఇన్విజిలేటర్లు. భద్రత ఏర్పాట్లకు ఏర్పాటు జరిగా యని తెలిపారు. పరీక్షను వాయిదా వేయడం వల్ల అతి సల్వ సంఖ్యలో అభ్యర్థులకు ప్రయోజనం ఉండవచ్చునని.. అయితే, బహుళ సంఖ్యలోని అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు.

వాదనల తర్వాత హైకోర్టు, పరీక్షల వాయిదాకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.