పంట పొలం.. ఫలహారం!
నీరు లేక నెర్రెలు బారుతున్న వరి పొలాలు
ఎండుతున్న పొలాలను పశువులకు మేతగా ఇస్తున్న రైతన్న
ఎండిన ఉప కాలువలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు!
నూతనకల్ మండలంలో అధికారుల తీరుపై రైతన్నల ఆగ్రహం
ఉప కాలువలకు నీటిని విడుదల చేయాలని వేడుకోలు
నూతనకల్, మార్చి 26: తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. మండలానికి గోదావరి జలాలు వస్తున్నప్పటికీ, అవి పొలాలకు చేరకపోవడంతో పొట్టదశలో వరి పొలాలు నెర్రెలుబారుతున్నాయి. దీంతో ఎండుతున్న వరి పొలాలను రైతులు తమ పశువులకు మేతగా వేస్తున్నారు. దీంతో పచ్చని పంట పొలాలు పశు వులకు పలహారంగా మారిపోతున్నాయి.
ఎండుతున్న ఉప కాల్వలు
ప్రధాన కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తున్నా, ఉప కాలువలు వెలవెలబో తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల గోదావరి జలాల నీటి సామర్థ్యాన్ని తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నీరు కేవలం ప్రధాన కాలువకే పరిమితమవుతోంది. ఉప కాలువల ద్వారా నీరు ప్రవహిస్తేనే గ్రామాల్లోని కుంటలు, చెరువులు నిండుతాయి. చెరువులు నిండితేనే భూగర్భ జలాలు పెరిగి, బోర్లు మరియు బావులకు నీరు అందుతుంది. వేసవి సమీపిస్తున్న తరుణంలో 69, 70, 71 డిబిఎంలకు నీటి సామర్థ్యాన్ని పెంచి విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
లస్కర్ల జాడేది?
మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను ఇటీవల 13 మంది లస్కర్లను ప్రభుత్వం నియమించింది. ఎస్సారెస్పీ కాలువలను పర్యవేక్షించాల్సిన వీరు, విధుల్లో ఘోరంగా విఫలమవుతున్నారని రైతులు వాపోతున్నారు. కాలువపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు రైతులు యథేచ్ఛగా మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. మరికొందరు సొంత పొలాల కోసం కాలువలకు గండ్లు కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ అక్రమ చర్యల వల్ల చివరి భూములకు చుక్క నీరు కూడా అందడం లేదు.
పశువులకు మేత అవుతున్న వరి పొలాలు
మండలంలో అనేక మంది రైతుల పంట పొలాలు ఎండిపోతుండడంతో రైతులు వాటిని పశువులకు మేతగా వాడుతున్నారు. కొందరు రైతులు తమ గేదెలు, గోవులు, ఎద్దులను వాటిలో వదులుతుండగా, మరి కొందరు తమకు ఉన్న గొర్రెలను వాటిలో వదులుతున్నారు. పశువులు లేని రైతులు పెట్టుబడి పెట్టీ ఊరికే ఇవ్వలేక గొర్రెల మందలు ఉన్న వారికి ఎకరానికి రూ.1 _ 2 వేల వరకు డబ్బులు మాట్లాడుకుని ఇస్తున్నారు. దీంతో వారు రోజుల తరబడి వాటిలో మేపుకుంటూ. మొత్తానికి పచ్చని పొలాలు పలహారంగా మారాయి అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు నీటి సరఫరా పై దృష్టిని సారించి ఉపకాలవులకు నీటిని విడుదల చేసి పంట పొలాలు ఎండకుండా కాపాడాలని మండలంలోని పలు గ్రామాల రైతుల కోరుతున్నారు.
నాల్గు ఎకరాల పంట ఎండుతోంది
కాలువల ద్వారా నీరు రాకపోవడంతో పంట చేతికి వచ్చే సమయంలో రైతుల పొలాలు ఎండుతున్నాయి. నాలుగు ఎకరాల భూమిలో సాగుచేసిన వరి పొలం పొట్ట దశకు వచ్చిన తర్వాత నీరు అందకపోవడంతో ఎండిపోతుంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. నాలాగా అనేకమంది రైతులు పంట ఎన్నుడుతుండడంతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నీలి చి పంటలను కాపాడాలి.
వేల్పుల లింగయ్య, మాచినపల్లి, నూతనకల్ మండలం
ఉప కాలువలకు నీటిని విడుదల చెయాలి
మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందేలా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఉప కాలువల్లో ఉన్న చెట్లను,అడ్డంకులను తొలగించి నీటిని విడుదల చెయ్యడమే కాకుండా ,లస్కర్ల పర్యవేక్షణలో ప్రతి కుంటను, ప్రతి చెరువును నింపాలి.‘లేనిపక్షంలో ఉద్యమరీతిలో ధర్నా నిర్వహిస్తాం.
తొట్ల ప్రభాకర్, సీపీఐ మండల కార్యదర్శి




