4 May, 2026 | 9:57 PM

వరి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి

04-05-2026 08:40 PM

వనపర్తి,(విజయక్రాంతి): రబీ సీజన్ కు సంబంధించిన వరి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, ట్రాన్స్పోర్ట్, ఎపీఎంలతో వడ్లు కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. గత రబీ సీజన్ లో ఇదే మే, 3 నాటికి వనపర్తి జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తే ఈ రబీ సీజన్ లో ఇప్పటి వరకు కేవలం 10 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ఆత్మకూరు, అమర్చింత, మదనపూర్, కొత్తకోట మండలాల్లో కోతలు ప్రారంభమై, వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని, కొనుగోలు ఎందుకు ఆలస్యమవుతుందని ఒక్కో ఎ పి.యం వారిగా ప్రశ్నించారు.  కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని ఎ.పి.యం. లు కలెక్టర్ దృష్టికీ తీసుకురాగా అక్కడే ఉన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెంకటస్వామి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మండలాలకు 40 వాహనాలు పెట్టేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని, మరి వాహనాలు ఎక్కడున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

20 వాహనాలు పెట్టమని మిగిలినవి వెంటనే పంపిస్తానని కాంట్రాక్టర్ చెప్పారు. మొత్తం వాహనాలు ఫీల్డ్ లో కనిపించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాల వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కొనుగోలు కేంద్రానికి వచ్చిన వడ్లు నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి మిల్లుకు పంపించాలని సూచించారు. వడ్లు తూకం అయి లారీలో ఎక్కించిన వెంటనే ట్రక్ షీట్ తీసుకొని ట్యాబ్ ఎంట్రీ చేయాలని, రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వారి అకౌంట్ లో జమ అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. 

అకస్మాత్తుగా వర్షాలు పడితే వడ్లు తడిచిపోకుండా అవసరమైన మేరకు టార్ఫాలిన్లు దగ్గర ఉంచుకోవాలని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోను వర్షం వల్ల ధాన్యం తడిచిపోయింది అనే వార్త రాకూడదని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ట్రాన్స్పోర్ట్ అధికారి మానస, డి.సి.ఓ బి. రాణి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, డి.యం సివిల్ సప్లై ఆంజనేయులు,  ఎ.పి.యం లు తదితరులు పాల్గొన్నారు.