13-05-2025 01:26:03 AM
ఊహించని దాడులతో దాయాదికి అపారనష్టం!
న్యూఢిల్లీ, మే 12: పచ్చని కశ్మీరంలో రక్తచరిత్రను లిఖించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదా నికి భారత్ దీటుగా బదులిచ్చింది. దాయాది ఊహించని విధంగా ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రత్యర్థిని చావు దెబ్బ కొట్టింది. పాక్‌తో పాటు పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఈ ఆపరేషన్ చేప ట్టినట్టు భారత్ స్పష్టం చేసింది.
మొదటి నుం చి పాకిస్థాన్ ఎన్నో అసత్యాలను ప్రచారం చేసినా కానీ ప్రపంచ దేశాలు పెద్దగా నమ్మలేదు. పాకిస్థాన్ ఓ పక్క తమ దేశ పౌరుల మీద భారత్ దాడులు చేస్తోందని దొంగ ఏడుపులు ఏడుస్తూనే మరో వైపు భారత్‌లో ఉన్న అమాయకులపై, వారి నివాస సముదాయాలపై విచక్షణారహితంగా దాడులు చేసింది. మన సైన్యం ఉగ్ర, వైమానిక స్థావరాలపై స్పష్టమైన ఆధారాలతో చేసిన దాడు ల్లో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ధ్వంసమైన స్థావరాలివే..
ఇంకా తెల్లవారక ముందే భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముప్పేట దాడులు చేసింది. పాక్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను ఎంచుకుని కచ్చితత్వంతో వాటిని ధ్వంసం చేసింది. మన దేశంలో ఉన్న వైమానిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు పాక్ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మన రక్షణ వ్యవస్థ ముందు పాక్ పప్పులు ఉడకలేదు. భారత్ చేపట్టిన దాడుల్లో పాకిస్థాన్‌లోని అనేక వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
చక్లాలా (నూర్ ఖాన్) బేస్: ఈ వైమానిక స్థావరం రావల్పిండి దగ్గర్లో ఉంది. ఇక్కడ పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కాలేజీ కూడా ఉంది. ఈ దాడుల్లో అది కూడా తీవ్రంగా ధ్వంసమైంది.
రఫీకీ బేస్: ఈ వైమానిక స్థావరం అతిపెద్ద రన్‌వేలతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ వైమానిక స్థావరం చెప్పలేని విధంగా ధ్వంసం అయింది.
రహీమ్‌యార్ ఖాన్ బేస్: పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో ఈ వైమానిక స్థావరం ఉంది. ఈ స్థావరం నుంచి డ్రోన్లు, యూఏవీలను పాక్ లాంచ్ చేసింది.
మురీద్ బేస్: ఉత్తర పంజాబ్‌లో ఉన్న ఈ వైమానిక స్థావరం భారత్ చేసిన దాడులతో అతలాకుతలం అయింది. ఇక్కడి నుంచే అనేక డ్రోన్లు, మిస్సైళ్లను పాక్ లాంచ్ చేసింది. దాడి తర్వాత ఈ స్థావరంలోని రన్ వే పూర్తిగా ధ్వంసం అయింది.
కేవలం ఇవి మాత్రమే కాకుండా సుక్కూర్, భోలారి, సర్గోదా, జాకోబాబాద్, చునియన్ స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ దాడులతో పాక్ భారీగా నష్టపోయింది.