దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం
హైదరాబాద్: దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తుంటే.. మోదీ, బీజేపీ ప్రభుత్వం ఇంట్లో కూర్చొని, దేవుడి పేరుతో ఓట్ల రాజకీయం చేస్తూ అధికారం దక్కించుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న మోడీని ఈ దేశ ప్రజలు మూడో సారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారని, దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలని జనాల మధ్య తిరుగుతున్న రాహుల్ గాంధీని ప్రధానిని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం వుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
డీలిమిటేషన్ బిల్, మహిళా బిల్ లలో లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుంచి పాత బస్ స్టాండ్ వద్ద వున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డీలిమిటేషన్ బిల్లు ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... గ్రామాల నుంచి రాజధాని వరకు ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించేలా అంబేద్కర్ హక్కులు కల్పించారని, కేంద్రంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం.. ఈ దేశ ప్రజల హక్కులను కాల రాయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
డీలిమిటేషన్ ఇష్టానుసారంగా చేస్తున్నారని, ఈ బిల్ పాస్ అయితే దేశం తీవ్రస్థాయిలో నష్టపోతుందని రాహుల్ గాంధీ చర్చ పెట్టారని, రానున్న ప్రమాదాన్ని ముందుగానే రాహుల్ గాంధీ గుర్తించి, దేశ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారకుండా ఉండేందుకు, బీజేపీ సాగిస్తున్న పొలిటికల్ గేమ్ ను ఆపడానికి రాహుల్ పార్లమెంట్లో పోరాడుతున్నారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, పార్లమెంటును కేవలం తాము ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే వాడుకుంటోందని, ఈ దేశ ప్రజల జీవితాల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి సమస్యల పరిష్కారం గురించి పార్లమెంటులో చర్చించడానికి ప్రధాని మోడీ రెడీగా లేరని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం జనాల్లో ఉంటున్న రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు మాత్రమే ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. జోడోయాత్ర, న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ… దేశంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దగ్గర నుండి గమనించారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఒకప్పుడు పార్లమెంటులో సామాన్యుల గురించి చర్చించడానికి ఎంపీలందరికీ అవకాశం కల్పించేవారు. కానీ ఇప్పుడైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ దేశ ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి ఎంపీలకు అవకాశమే ఇవ్వడం లేదన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం, పెట్రోలు, డీజీలు, ఎరువులు ఇలా అన్నింటి ధరలు పెరిగాయని, రైతులకు మేలు చేసే పథకాలు ఏవి అమలు కావడం లేదని విరుచుకుపడ్డారు. దేశ ప్రజలు ఈ విషయాలను గమనించాలని, దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మనమందరం అండగా నిలవాలని జగ్గారెడ్డి కోరారు.






