13-05-2025 01:22:26 AM
ఉద్రిక్తతలు తగ్గడంతో తెరుచుకుంటున్న విమానాశ్రయాలు
న్యూఢిల్లీ, మే 12: భారత్ మధ్య కాల్పుల విరమణ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ జరిగిన శనివారం రాత్రి నుంచి శ్రీనగర్‌లో బ్లాకౌట్ ఎత్తివేశారు. అప్పటి నుంచి అక్కడ ఎలాంటి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతలు వినిపించడంలేదు. అలాగే జమ్మూ నగరంలో కూడా పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. పూంచ్, రాజౌరి, అఖ్నూర్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగా ఉంది.
పాకిస్థాన్ సరిహద్దులోని పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్‌లో సైతం ప్రస్తుతం ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ప్రకటన వచ్చినా కొన్ని గంటల్లోనే పాక్ డ్రోన్లు పంపించడంతో అమృత్‌సర్‌లో బ్లాకౌట్ అమలు చేశారు. ఆదివారం ఉదయం ఎత్తివేశారు. పాక్‌తో పొడవైన సరిహద్దు ఉన్న రాజస్థాన్‌లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది.
అయితే కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా బ్లాకౌట్ అమలుచేస్తున్నారు. భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో చాలా మంది వలస వెళ్లారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఇప్పుడిప్పుడే సొంత స్థలాలకు చేరుకుంటున్నారు. అయితే కొందరు ఇప్పుడే సొంత ఇండ్లకు వెళ్లాలనుకోవడం లేదని, మరికొన్ని రోజులు వేచిచూస్తామని అంటున్నారు.
తెరుచుకున్న ఎయిర్‌పోర్టులు
కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను సోమవారం తిరిగి తెరిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటీస్ టు ఎయిర్‌మెన్ జారీ చేశారు.
భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన విమానాశ్రయాలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఊపిరిపీల్చుకున్నాయి. పౌరవిమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు చెప్పారు.