పాక్ కొత్త కూటమి
పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మిగతా దేశాలపై దాడిగానే పరిగణించనున్నట్లు మూడు దేశాలు సంయుక్తంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. సౌదీ ఆర్థిక బలం, పాకిస్థాన్ సైనిక బలగం, అణ్వస్త్ర సామర్థ్యం, తుర్కియే రక్షణ సాంకేతికతలు ఈ కూటమి ప్రాముఖ్యతను పెంచుతున్న నేపథ్యంలో భారత్ తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
పాకిస్థాన్‌తో భారత్‌కు దశాబ్దాలుగా ఘర్షణలు కొనసాగుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిహద్దు వివాదాలు, పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం వంటి అంశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పదేపదే పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో రెండు శక్తివంతమైన దేశాలు రక్షణ భాగస్వాములుగా మారడం సహజంగానే భారత్ దృష్టిని ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా తుర్కియే వైఖరి భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నది.
గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఆ దేశం భారత్‌పై దాడులు చేసేందుకు దాయాదికి డ్రోన్‌లు కూడా అందించినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు భారత్‌తో ఇంధనం, ఆర్థికపరంగా వ్యూహాత్మక సంబంధాలు కలిగిన సౌదీ అటు పాక్‌తోనూ సత్సంబంధాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు అంత ర్జాతీయ సంస్థలు భారీ మొత్తంలో రుణాలు ఇవ్వడంలో సౌదీ కూడా కీలక పాత్ర పోషించింది.
ఈ తరుణంలో పాక్ గతేడాది కుదుర్చుకున్న పరస్పర రక్షణ ఒప్పందం ఇప్పుడు తుర్కియే భాగస్వామ్యంతో మరింతగా విస్తరించి వ్యూహాత్మక రూపాన్ని సంతరించుకున్నది. అయితే భవిష్యత్తులో భారత్‌తో ఏదైనా ఘర్షణ తలెత్తితే సౌదీ, తుర్కియే నేరుగా పాక్ తరఫున యుద్ధంలోకి దిగుతాయని చెప్పడం తొందరపాటే అవుతుంది.
ఈ ఒప్పందం ప్రధానంగా ఒక వ్యూహాత్మక సాధనమని చెప్పక తప్పదు. యుద్ధ పరిస్థితుల్లో ప్రతి దేశం తన ప్రయోజనాలు, ప్రాంతీయ పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ, ఈ ఒప్పందాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఈ కొత్త కూటమిని పాక్‌కు దక్కిన అదనపు రక్షణ కవచంగా చూడటం కంటే, మారుతున్న పశ్చిమాసియా శక్తి సమీకరణాల్లో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.






