ఆదివాసీల అస్తిత్వ పోరు
ఆదివాసులు అడవితల్లి ముద్దు బిడ్డలు. ఈ సమాజానికి మూల వారసు లు. సంస్కృతి, సాంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దం ఆదివాసీ లు.- అలాంటివారు నేడు నాగరిక సమాజంలో ఇమడలేక తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. క్రీ.శ 1240 నుంచి 1750 వరకు విలసిల్లిన గోం డ్వాన రాజ్యాలను ఏలిన ఆదివాసులు నేడు అణచివేత, దోపిడీకి గురవుతూ అంతరించిపోయే దశలో ఉండటం బాధాకరం. తరతరాలుగా అడవుల్లో, కొండల్లో నివసించే, ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీల జీవన వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైపోయింది.
సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో ఆదివాసుల స్వయంపాలన అంతమైపోయింది. ఆదివాసీలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్న నేపథ్యంలో వారి సాంప్రదాయక పోరాటాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ కమిటీ దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ తెగలను గుర్తించింది. ప్రధానంగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలో 18 తెగలను,
హైదరాబాద్ రాష్ట్రంలో 9 తెగలను రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగల రక్షణ కోసం పొందుపరిచిన ఆర్టికల్ 342లో చేర్చింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అనంతరం సుగాలీలను ఆర్టికల్ 342తో సంబంధం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారు. ఆ తర్వాత 1970లో తెలంగాణలో మైదాన ప్రాంత గిరిజనులుగా లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపారు. అయితే, వీరికి కూడా ఆర్టికల్ 342 కింద రక్షణ కల్పించలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 (1) ప్రకారం భారతదేశంలో ఒక కులాన్ని తెగగా గుర్తించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
ఒక కులాన్ని తెగగా మార్చే క్రమంలో ముందుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలి. అన్ని ప్రాంతాల్లో ఒకే తెగగా గుర్తింపు ఉండటం, నాగరిక సమాజంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి వెనుకంజ వేయడం, అడవుల్లో స్థిర నివాసం ఉండటం, ప్రత్యేక భాష, వేషధారణ, సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉండటం, వెనుకబాటుతనం వంటి అంశాలను కమిషన్ ధ్రువీకరించాలి. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేసి, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే ఎస్టీలుగా గుర్తింపు పొందుతారు. కానీ, ఈ ప్రక్రియలు జరగకుండానే నేడు ఎస్టీలుగా చెలామణి అవుతున్నవారు ఆదివాసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలను దోచుకుంటున్నారు.
ఆర్టికల్ 244 పేరా (1) ప్రకారం 1950లో గుర్తించిన తెగలకే గిరిజన ప్రాంతాల్లో 29 శాఖలలో ఉద్యోగాలు కల్పించాలి. కానీ, కొందరు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొందుతూ ఈ ఉద్యోగాలను సైతం లాక్కుంటున్నారు. మరోవైపు కొంతమంది జాతి గౌరవాన్ని తాకట్టు పెడుతూ ఆదివాసీ సమాజానికి నమ్మకం ద్రోహం చేస్తున్నారు. నేడు ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసేతరుల చేతుల్లో బందీలుగా మిగిలిపోతున్నాయి. జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలలో కలపడం పెనుశాపంగా మారింది.
ఫలితంగా ఉద్యోగాలతోపాటు ఆదివాసీల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీల మనుగడ కోసం ఈ కింది చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటుహక్కును రద్దు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోకి గిరిజనేతరుల వలసలను అడ్డుకోవాలి. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి. ఐటీడీఏలో అవీవీతిని అరికట్టాలి. ఐటీడీఏలో అన్ని పోస్టుల్లో ఆదివాసీలనే నియమించాలి. పీసా, 1/70 చట్టాలు, జీవో నంబర్ 3ని పకడ్బందీగా అమలు చేయాలి.
ఏజెన్సీలో పోలీస్ శాఖను ఐటీడీఏ నియంత్రణలోకి తీసుకురావాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనేతరుల పట్టాలను రద్దు చేయాలి. ఈ నేపథ్యంలో జల్ హక్కుల సాధన కోసం కొమరం భీం, బిర్సా ముండా, పోయం గంగులు, సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త సెల్: 9866073866






