కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు
పండుగ వేళ ప్రయాణికుల అవస్థలు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి(Rakhi Festival) సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు మండల కేంద్రాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి బస్సు మహిళలు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒక్కో బస్సులో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు సరిపోకపోవడంతో అవస్థలు తప్పలేదు. బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులు బస్సు రాగానే ఎక్కేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






