తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన నామనాగేశ్వరరావు
ఖమ్మం:(విజయక్రాంతి) బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మైనార్టీ మాజీ అధ్యక్షులు, ఆత్మీయ నాయకులు మహమ్మద్ తాజుద్దీన్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం పరామర్శించారు. తాజుద్దీన్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తాజుద్దీన్ మృతి ఎలా సంభవించిందనే వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాను ఢిల్లీలో ఉండటం వల్ల తాజుద్దీన్ ని కడసారి చూడలేకపోయానని నామ నాగేశ్వరరావు బాధను వ్యక్తం చేశారు.
తాజుద్దీన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన నామ నాగేశ్వరరావు పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. తాజుద్దీన్ కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న విషయం తెలుసుకుని, అతని చదువులు పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందిస్తానని, ఉద్యోగం సంపాదించే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఏ అవసరం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తనకు నేరుగా ఫోన్ చేయాలని సూచిస్తూ వారికి ధైర్యం చెప్పారు.






