18-11-2025 12:24:57 AM
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:17సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సిద్దిపేటలో ఎక్తా ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగిన ర్యాలీకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, అదనపు కలెక్టర్ అ బ్దుల్ హమీద్, జిల్లా అధికారులు,ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ భారత ఏకీకరణకు నాంది పలికిన ఉక్కు మనిషి అని తెలిపారు.
స్వాతంత్య్రం సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలను ఒక్క భారత్గా మార్చడంలో పటేల్ పాత్ర అపారమని పేర్కొన్నారు. హైదరాబాద్ విలీనం ఆపరేషన్ పోలో ద్వారా సాధ్యమైందని గుర్తుచేశారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా ప్రకటించడం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.దేశ సమైక్యతను భంగం చేసే శక్తులకు తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్ను వికసిత దేశంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులతో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. తరువాత డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ, మహనీయుల త్యాగాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చే పని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్లు సర్దార్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, క్రీడల అధికారి వెంకట నర్సయ్య, యువజన అధికారి రంజిత్ రెడ్డి, అర్బన్ తహసీల్దార్, ఎంఇఓలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.