వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి
కూకట్‌పల్లి, మే 28, (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా రామయ్య పల్లికి చెందిన ఉమ్మల్ల మల్లయ్య (55)గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ కోసం ఈనెల 26వ తారీకు న కూకట్పల్లి లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేరాడు.
ఆపరేషన్ అనంతరం తీవ్రంగా కడుపునొప్పి వస్తుందని పలుమార్లు ఆసుపత్రి వైద్యులకు తెలిపిన వైద్యులు నిర్లక్ష్యంతో ఆపరేషన్ అనంతరం అలాగే ఉంటుందని సమాధానం ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నొప్పితో బాధపడుతున్న మల్ల య్య గురువారం ఉదయం ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మల్లయ్య మృతి చెందాడని కూకట్పల్లి పోలీసులకు మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.






