13-01-2026 11:51:56 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా బెండరే కృష్ణాజీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల చెల్లింపునకు సంబంధించిన చెక్కుపై మంగళవారం తొలి సంతకం చేశారు. గ్రామ పరిపాలనలో భాగంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు మౌలిక సేవలు అందించడంలో వారి సేవలు అభినందనీయమని అన్నారు. కార్మికుల సమస్యలను సకాలంలో పరిష్కరించి, వారి హక్కులు, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలన అందించడమే తమ లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడి సంతోష్, గ్రామపంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్య, గ్రామపంచాయతీ సభ్యులు, ఇతర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.