మీరే పార్టీకి బలం.. బలగం
- ప్రభుత్వం లేకపోయిన సత్తా చూపించిన ఏకైక జిల్లా ఇది
- డీసీసీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
- జోడేద్దుల వలే అభివద్ది
- సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం : భట్టి
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : పొంగులేటి
ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ ఖిల్లా అని, కష్టకాలంలో కాంగ్రెస్ ను ఏకతాటిపై ఉండి గెలిపించిన ఘనత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ లో నూతనంగా ఎంపికైన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ బాధ్యుల పదవి బాధ్యతల స్వీకార మహోత్సవంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామారెడ్డిల సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
80మంది నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలై బలం.. వారే బలగం అంటూ కొనియాడారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించారని, అలాంటి నాయకులను మర్చిపోలేమన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
జోడేద్దుల్లా ప్రభుత్వ పథకాలు అమలు
తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు అప్పుల కుప్ప చేసి వెళ్లిపోయారని, రాష్ట్రం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి జోడేద్దుల్లా సంక్షేమాభివృద్దిని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుగు తీసుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోలుకు బోనస్, ఇన్ టైమ్ లో ఆసరా పింఛన్లు, వడ్డి లేని రుణాలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, విద్యా, వైద్యం కోసం అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ప్రజలకు సన్నబియ్యంను ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభు త్వం తెలంగాణ కాంగ్రెస్ పేర్కొన్నారు.
ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లండి
గత పాలకులు గోరంత చేసి.. కొండంతా బిల్డఫ్ ఇస్తూ ప్రచారం చేసుకున్నారని, మన ప్రభుత్వం కొండంతా చేస్తూ..గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలని, తద్వారా రాబోయే రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం
ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కోదాడ క్రాస్ రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. జడ్పీసెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి ఆఫీస్ కు ర్యాలీగా చేరుకున్నారు. పార్టీ జెండాను పీసీసీ అధ్యక్షుడు అవిష్కరించారు. అనంతరం నూతనంగా నియామకం అయిన 80మందికి నియామక పత్రాలను అందించారు. ఎమ్మెల్యేలు మాలోతు రాందాసు నాయక్, మట్టా రాగమయి, గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జావిద్, కొండబాల కోటేశ్వరరావు , బాలసాని లక్ష్మినారాయణ, మద్ది శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






