దేశానికి గాంధీ పాలన కావాలి

21-04-2024 12:03:49 AM

l మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

l ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించిన మంత్రి

ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): దేశానికి గాంధీ సిద్ధాంతంతో కూడిన పరిపాలన కావాలని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద మంత్రి నివాళి అర్పించారు. ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు సిడాం రాంకిషన్, తెలంగాణ కార్మిక సంఘం నేతలు షేక్‌బాబు, షేక్ అహ్మద్, ప్రమోద్ చౌదరి తదితరులు సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఎన్నో గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాల కోసం పాటు పడిన పార్టీ అని స్పష్టంచేశారు. పదవులను తృణప్రాయంగా త్యజించిన చరిత్ర గాంధీ కుటుంబానికే దక్కుతుందని పేర్కొన్నారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. ఇతరులకు పదవులిచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపిస్తున్నారని మోదీ ప్రభుత్వానికి చురకులు అంటించారు. మోదీ తన దోస్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. 

సైనికుల్లా పని చేస్తాం : బల్మూరి వెంకట్

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పని చేస్తామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఇందు కోసం అన్ని జిల్లాల ఎన్‌ఎస్‌యూఐ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయని స్పష్టంచేశారు. 17 స్థానాల్లో 14 విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు రాధోడ్ బాపూరావు, రేఖానాయక్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ఇంచార్జీలు కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడే గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.