28 May, 2026 | 2:32 AM

అద్దె పద్ధతిలోనే పెద్ది

28-05-2026 01:19 AM

చిరంజీవి జోక్యంతో వెనక్కి తగ్గిన తెలంగాణ ఎగ్జిబిటర్లు  

‘పెద్ది’ సినిమా తెలంగాణ రాష్ట్రంలో అద్దె పద్ధతిలోనే ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా పర్సంటేజీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘పెద్ది’ నుంచే పర్సంటేజీ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. రెంటల్ సిస్టమ్‌నే కొనసాగి స్తామంటూ నిర్మాతలు వాదిస్తూ వచ్చారు. మొత్తానికి పర్సంటేజీ పంచాయితీ అగ్ర నటుడు చిరంజీవి చెంతకు చేరింది. సోమవారం చిరంజీవితో భేటీ అయి, తమ సమస్యలు తెలియసిన తెలంగాణ ఎగ్జిబిటర్లకు బుధవారం మరోసారి మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో పలువురు ఎగ్జిబిటర్లు చిరుతో సమావేశమయ్యారు.

మెగాస్టార్‌ను కలిసిన వారిలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్య క్షుడు శేఖర్‌రావు, గౌరవ కార్యదర్శి వీఎల్ శ్రీధర్, ఎగ్జిబిటర్లు అనుపమ్‌రెడ్డి, బాల గోవింద్ రాజు, భరత్ నారంగ్ తదితరులున్నారు. సమావేశం అనంతరం సెక్రటరీ శ్రీధర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. “చిరంజీవితో జరిపిన చర్చల అనంతరం తెలంగాణ ఎగ్జిబిటర్ల తరఫున తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయాలను అందరి దృష్టికి తీసుకువస్తున్నాం.

జూన్ 30వ తేదీ పర్సంటేజీ విధానం అమలయ్యేలా చూస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. అయితే, జూలై 3వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేస్తామని, జూలై 3వ తర్వాత విడుదలయ్యే సినిమాలకు అద్దె విధానంలో కాకుండా, పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని స్పష్టం చేశాం” అని ఛాంబర్ గౌరవ కార్యదర్శి శ్రీధర్ పేర్కొన్నారు.