పెద్దితో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతిబాబు విలేకరులతో ‘పెద్ది’ విశేషాలను పంచుకున్నారు. “పెద్ది’లో అప్పలసూరి పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తొలిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది.
సినిమా మొత్తం జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్ర మే కనిపిస్తాడు. గుర్తుపెట్టుకునే నా పాత్రల నంబర్ వన్ స్థానం ‘అప్పలసూరి’దే. భావోద్వేగాలు, నటన, గెటప్, లుక్, డెప్త్ పరంగా నేనున ఇప్పటివరకు చేసిన ఏ పాత్రలోనూ లేదు. ఈ సినిమా చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఈ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఇది తండ్రి పాత్ర కాదు. చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర చేశా. నా పాత్రకూ, రామ్‌చరణ్ పాత్రకూ మధ్య అందమైన, భావోద్వేగభరితమైన సంబంధం ఉంటుంది.
ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ‘పెద్ది’ మరో ఎత్తు. ఈ సినిమాను ఎంతో ఇష్టంతో చేశా. డబ్బింగ్ మాత్రం చాలా కష్టంగా అనిపించింది. నిజంగా డబ్బింగ్ ఒక ఛాలెంజ్. చాలా సమయం, శ్రమ పెట్టా. ఒకరోజంతా కూర్చుని రెండు డైలాగులే చెప్పిన సందర్భాలున్నాయి. కానీ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. అప్పలసూరి బయటకు రావాలంటే అతని వాయిస్ తోనే సాధ్యం. ఆ పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకెవ్వరూ కనిపించకూడదనేది నా ప్రయత్నం.
ప్రతిరోజూ మేకప్‌నకు దాదాపు మూడు గంటల సమయం పట్టేది. -ప్రోస్థెటిక్ మేకప్‌లో చాలా సవాళ్లుంటాయి. చర్మం పై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి. వాటికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చేది. అయినా ఈ పాత్ర కోసం చేసిన శ్రమ మొత్తం విలువైందనిపించింది. ‘పెద్ది’ ఈరోజు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లాంటి సినిమా. గట్టిగా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఒక నటుడుగా నేను కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నా. మంచి క్యారెక్టర్ దొరికిందనే సంతోషం ఉంది. ఇక నేను చేస్తున్న ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే.. -ప్రస్తుతం సోనీలివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే భారీ వెబ్ సిరీస్ చేస్తున్నా. చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ అది.






