నిబంధనలకు పాతర.. పాదబాటలు ఆక్రమణ
- ఫుట్పాత్లపై దుకాణాలు, తోపుడు బండ్ల ఏర్పాటు
- కాలినడకన వెళ్లలేని పరిస్థితి
- గ్రిల్స్ తొలగింపుతో నేరుగా రోడ్డుపైకి వస్తున్న పాదచారులు...
- పెరుగుతున్న ప్రమాదాలు
- చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న ప్రజలు
నర్సాపూర్, జూలై 24: నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఫుట్పాత్ల ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పాదచారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దుకాణదారులు ఫుట్పాత్లపై సామగ్రిని ఉంచడం, చిరు వ్యాపారులు తోపుడు బండ్లు, పండ్లు, దుస్తుల దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల కాలినడకన వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాదచారులు నేరుగా రహదారిపై నడవాల్సి వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్‌నర్సాపూర్‌హైదరాబాద్ 765-డీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా మూడు మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్లు నిర్మించారు. అయితే ప్రస్తుతం అవి ప్రజల కోసం కాకుండా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దుకాణాల ముందు టీ స్టాళ్లు, పానీపూరి, మిర్చి బండ్లు, ఇతర తోపుడు బండ్లను రోజువారీగా అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం. ఇందుకు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బైక్ మెకానిక్లు కూడా ఫుట్పాత్లపైనే వాహనాల మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
గ్రిల్స్ తొలగింపుతో ఇబ్బందులు..
రహదారి పక్కన ఇరువైపులకు ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ను పలుచోట్ల తొలగించడంతో దుకాణాల నుంచి ప్రజలు నేరుగా రహదారిపైకి వస్తున్నారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఉదయం వేళల్లో అల్పాహారం కోసం వచ్చే వారి రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. పట్టణంలో సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, పాదచారుల రాకపోకలకు అనుకూలంగా మార్చడంతో పాటు ట్రాఫిక్ భద్రతపై ఫుట్ పాత్ అక్రమణదారులపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






