స్కాలర్షిప్స్ ను ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం రోజున ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి అనంతరం ధర్నా నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేసి వారిని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కూడా వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్,ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని,అలాగే నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేయాలన్నారు.
జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడీ రెండు సంవత్సరాలు అవుతున్న కూడా రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలను పట్టించుకోని వెంటనే పరిష్కరించాలన్నారు లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.






