5 August, 2026 | 11:31 PM

500 కోట్లతో మహబూబ్‌సాగర్ సుందరీకరణ

03-09-2025 12:00 AM

సీఎం రేవంత్‌రెడ్డితో త్వరలో శంకుస్థాపన సమీక్ష నిర్వహించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, సెప్టెంబర్ 2 :  సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ సుందరీకరణ కోసం రూ.500 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం హెచ్‌ఎండీఏ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులతో కలెక్టరేట్ లో  టీజిఐఐసి చైర్ పర్సన్  నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యం లో   రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ సాగర్ సుందరీకరణకు చేపట్టబోయే పనులకు  సంబంధించి వీడియోను, పవర్ ప్రజంటేషన్ను హెచ్‌ఎండీఏ అధికారులు ప్రదర్శించారు.

రూ.500 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు, బయట నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ లో కలవకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న25 ఏళ్ళకు సరిపోయేలా 23.5 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా డిజైన్ ను సిద్దం చేసినట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. 

టూరిజం, రిక్రియేషన్ సెంటర్‌గా రూపకల్పన..

నేషనల్ హైవే నుండి, ఐఐటి పక్క నుండి మహబూబ్ సాగర్ వరకు 100 ఫీట్ల లింక్ రోడ్  నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ రెండో దశలో రూ.65 కోట్లతో డీ షిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వర ఆలయం అభివృద్ది చేయనున్నామని, మహబూబ్ సాగర్ కట్ట వెడల్పు, సైకిల్ ట్రాక్ , రెండు లేన్ల బీటీ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 కోట్లతో శివుడి విగ్రహం,   

విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు, వాచ్ టవర్, రూ.9 కోట్లతో సంగమేశ్వర ఆలయ అభివృద్ధి, ప్రాజెక్ట్ రెండవ దశలో ఐలాండ్లు, వాటర్ థీమ్ పార్క్ , బోటింగ్ డెక్ ఏర్పాటు, రూ.9 కోట్లతో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులో రూపకల్పన చేసినట్లు తెలిపారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

మహబూబ్ సాగర్ అభివృద్ధి కోసం భూసేకరణ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆర్డీవోను జగ్గారెడ్డి కోరారు. అనంతరం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ , సంబంధిత శాఖల అధికారులతో కలిసి మహబూబ్ సాగర్ ను పరిశీలించారు. నిధులు లేకుంటే తన సొంత డబ్బులు రూ.50 లక్షలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా, సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్ నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్ జగ్గారెడ్డి వివరించారు.