27-10-2025 06:01:24 PM
పెండింగ్ బిల్లులు, వేతనాలు తక్షణమే విడుదల చేయాలి..
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేసిన కార్మికులకు బిల్లులు చెల్లించకుండా దసరా పండగ నాడు కూడా పస్తులు ఉంచారని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రం ఎర్ర గోపాల్ మీటింగ్ హాలులో నీరుడు రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటుచేసిన మండల కమిటీ సమావేశం హాజరై మాట్లాడారు. తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగు బిల్లులు, వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, పథకంలో పనిచేస్తున్న కార్మికులు పాఠశాలలు ప్రారంభం కానుంచి ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు వేతనాలు అందక దసరా పండగ రోజు కూడా తమ కుటుంబాలను పస్తులించిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.నెలల తరబడి బిల్లులు వేతనాలు రాకపోతే ఎలా వంట వండి పెడతారని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందు కార్మికులకు పదివేల వేతనం ఇస్తామన్న వాగ్దానాన్ని అమలు చేసి కార్మికుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు.
కార్మికులను కొత్త మెనూ పేరుతో ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. బిల్లులు సకాలంలో వచ్చిన రాకపోయినా ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తున్నారని పిల్లలని తమ కుటుంబ సభ్యుల వలె భావిస్తున్నారని అన్నారు.కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని అంగన్వాడి కేంద్రాల మాదిరిగా గుడ్లు సరఫరా ప్రభుత్వమే చేయాలని వంటకు సరిపడా గ్యాస్ను ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని,కాటన్ దుస్తులు యూనిఫామ్, కనీస వేతనం 26 వేల రూపాయలు ,ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి గంగుల దమయంతి, భయ్యా మహేశ్వరి, ఏకొండ మల్లమ్మ, బోయినపల్లి సత్తెమ్మ, జినకల లక్ష్మమ్మ, బొలుగూరి బిక్షమయ్య తదితరులు ఉన్నారు.