calender_icon.png 27 October, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

27-10-2025 06:03:47 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకేపల్లి గ్రామానికి చెందిన పోతిని చిన్న వెంకటస్వామి తనకు గల భూమిలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నానని, ఉత్పత్తి అయినందున విక్రయించుటకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. పెంచికలపేట మండల కేంద్రానికి చెందిన పాముల నందు తాను గతంలో ఎల్లూర్ గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

చింతల మానేపల్లి మండలం కేంద్రానికి చెందిన ఇప్ప కోసం తన పేరిట ఉన్న భూమికి పట్టా పాసు పుస్తకం కొరకు దరఖాస్తు చేసుకున్నానని, జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్ నగర్ పట్టణం ద్వారకా నగర్ కాలనీకి చెందిన కత్తెరపాక ప్రమీల తనకు గతంలో ఆసరా పింఛన్ వచ్చేదని, 6 సంవత్సరాలుగా రావడం లేదని, ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ అనూష బాయి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పాలకుర్తి సంతరక్క తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన అల్లూరి లింగయ్య తన భూమి ధరణి పోర్టల్ లో ఇతరుల పేరిట పట్టా అయినందున సవరించి తన పేరిట పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన కామ్రే మాధవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలోని బుద్ధ నగర్ వాసులు తాము 20 కుటుంబాలు నివాసం ఉంటున్నామని, తమకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన టేకం పోసు బాయి తాను 5వ తరగతి వరకు చదివి ఉన్నానని, కిరాణా షాపు ఏర్పాటు కొరకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థలలో మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నానని, రుణం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు.