22 June, 2026 | 9:11 PM

అదానీ చేతికి పెన్నా సిమెంట్

14-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 13: అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలో మరో భారీ టేకోవర్ చేసింది. మూడేండ్ల క్రితం యూరప్ దిగ్గజం హోల్సిమ్ నుంచి అంబూజా సిమెంట్, ఏసీసీలను టేకోవర్ చేసి నేరుగా సిమెంట్ ఉత్ప త్తి రంగంలో ప్రవేశించిన అదానీ తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న, ప్రతాప్ రెడ్డి ప్రమోట్ చేసిన పెన్నా సిమెంట్‌లో నూరుశాతం వాటాను కొనుగోలు చేస్తున్నది. అదానీ గ్రూప్ ఈ టేకోవర్‌ను అంబూజా సిమెంట్స్ ద్వారా జరుపుతున్నది.

రూ.10,422 కోట్లకు పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు  పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ (పీసీఐఎల్) కొనుగోలుకు ప్రమోటర్ గ్రూప్ పి.ప్రతాప్‌రెడ్డి, కుటుంబంతో ఒక బైండింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అంబూజా సిమెంట్స్ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ కొనుగోలుకు అవసరమైన నిధుల్ని అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని అంబూజా సిమెంట్స్ వెల్లడిం చింది. అంబూజా సిమెంట్స్ వృద్ధి ప్రయాణంలో ఈ కొనుగోలు ముఖ్యమైన చర్య అని కంపెనీ సీఈవో, పూర్తికాలపు డైరెక్టర్ అజయ్ కపూర్ చెప్పారు. పెన్నా సిమెంట్ టేకోవర్‌తో అంబూజా దక్షిణాదిన మార్కెట్ విస్తరించుకోగలుగుతుందని, సిమెంట్ పరిశ్రమలో పాన్‌ఇండియా లీడర్‌గా ఆవిర్భవించాలన్న లక్ష్యాన్ని చేరుకుం టామణని అన్నారు. 

14 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం

పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌కు 14 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదకసామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో 10 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తి జరుగుతుండగా, మిగిలిన సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద 2 మిలియన్ టన్నుల ప్లాంట్, రాజస్థాన్‌లోని  జోధ్‌పూర్‌లో మరో 2 మిలియన్ టన్నుల ప్లాంట్ నిర్మాణం 6 నెలల కాలంలో పూర్తవుతుందని అంబూజా సిమెంట్ స్టాక్ ఎక్సేంజ్‌లకు వెల్లడించింది. పెన్నా సిమెంట్ ప్లాంట్లలో 90 శాతానికి రైల్వే స్లుడింగ్స్ ఉన్నాయి.

మరికొన్నింటికి క్యాపిటివ్ విద్యుత్ ప్లాంట్లు, వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్ ఉన్నాయి. జోధపూర్‌ప్లాంట్‌లోని మిగులు క్లింకర్ అదనంగా 3 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్‌కు సరిపోతుందని, దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ ఉత్పాదక సామర్థ్యం 14 మిలియన్ టన్నులను మించుతుందని అంబూజా వివరించింది. పెన్నా సిమెంట్ ప్రస్తుత డీలర్లు అదానీ సిమెంట్ మార్కెట్ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతారని వెల్లడించింది. టేకోవర్ పూర్తికి 34 నెలల సమయం పడుతుందని తెలిపింది. పీసీఐఎల్ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో.. 2023 రూ.1,241 కోట్లు, 2022 రూ. 2,002 కోట్లు, 2021 రూ. 3,204 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ టేకోవర్‌తో అదానీ సిమెంట్స్ పాన్ ఇండియా మార్కెట్ వాటా 2 శాతం, దక్షిణాది వాటా 8 శాతం మేర పెరుగుతుందని కంపెనీ ఫైలింగ్‌లో తెలిపింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ వార్త వెలువడింది. అంబూజా సిమెంట్స్ షేరు రూ.4.90 తగ్గి రూ.663.80 వద్ద ముగిసింది.

రూ.10,442 కోట్లకు కొనుగోలు