calender_icon.png 14 February, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమానికి ప్రజలు పట్టం

14-02-2026 01:43:40 AM

  1. బీఆర్‌ఎస్, బీజేపీ కట్టుకథలను ప్రజలు నమ్మలేదు 
  2. అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తాం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 83 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లను  కైవసం చేసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందినవారు తమతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. 116 మున్సిపాలిటీలకు గాను 90 నుంచి 94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు.

కార్పొరేషన్లలో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించిందని అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గత రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్దఎత్తున మున్సిపల్ స్థానాలు రావడం సంతోషం కలిగించే విషయమన్నారు. అభివృద్ధి, సంక్షేమం విశ్వసనీయతకు రాష్ట్ర ప్రజలు పెద్ద పీటవేశారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఈ ఫలితాలతో తేటతెల్లమైందని డిప్యూటీ సీఎం తెలిపారు.

రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రతిరోజు గాలి కబుర్లు చెబుతూ, కట్టు కథలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపైన కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న విమర్శలను గమనించి రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన తీర్పును ఇచ్చారని అన్నారు. పట్టణ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగిందని, అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తామని భట్టి స్పష్టం చేశారు. ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ ఫలితాలతో స్పష్టమైందని అన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో.. వరుసగా ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రసారమాధ్యమాల్లో కనిపించాలని, ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలని ప్రతిపక్షాలు కట్టుకథలు అల్లడం, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలనీ డిప్యూటీ సీఎం సూచించారు.

ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలని ప్రజాస్వామ్యవాదిగా తాను బలంగా కోరుకుంటానని డిప్యూటీ సీఎం తెలిపారు. సంపూర్ణ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.