గోదావరి రాబోతోంది... శాశ్వత కట్ట ఎప్పుడు?
గోదావరి చుట్టుముట్టినా శాశ్వత పరిష్కారం శూన్యం
పునరావాస కేంద్రాలకే పరిమితమైన ప్రభుత్వ చర్యలు
వరద రాకముందే ఎత్తున ప్రదేశంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలు కట్టాలని ప్రజల డిమాండ్.
చర్ల, జూన్ 18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల గోదావరి పరివాహక గ్రామాలు ప్రతి ఏటా వరదతో అల్లాడుతున్నాయి. వరద వచ్చాక బోట్లు పంపి పునరావాస కేంద్రాలకు తరలించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగుస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వరద, ఏటా కన్నీళ్లు గోదావరి నీటి మట్టం 50-55 అడుగులు దాటితే దండుపేట, కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లి గ్రామాలు మునిగిపోతున్నాయి.
గత 5 ఏళ్లలో రెండుసార్లు భారీ వరదతో 2000 మంది పునరావాస కేంద్రాలకు తరలారు. పంటలు నష్టం, పిల్లల చదువులు గల్లంతు. ‘గోదావరి ఒడ్డుకొస్తే గుండె ఆగిపోతుంది. పునరావాస కేంద్రంలో గదులు లేవు, మరుగుదొడ్లు లేవు, పిల్లలకు పాలు లేవు‘ అని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. తాత్కాలిక ఉపశమనమే, శాశ్వత పరిష్కారం శూన్యం వరద వచ్చిన ప్రతిసారీ బాధితులను పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు తరలించి 15-20 రోజుల తర్వాత వెనక్కి పంపుతున్నారు. ఇల్లు దెబ్బతిన్నా ప్రత్యామ్నాయ గృహాలు లేవు. భద్రాచలం లెవెల్లో కరకట్ట, గ్రావిటీ వాల్ కట్టాలనే డిమాండ్ను అధికారులు పట్టించుకోవడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల డిమాండ్
వరద తర్వాత సహాయం కాదు, రాకముందే చర్యలు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. 1. గోదావరి ఒడ్డున పటిష్టమైన కట్ట నిర్మాణం, 2. ఎత్తున ప్రాంతంలో డబుల్ బెడ్రూం కాలనీలు 3. వరద హెచ్చరికలకు సైరన్లు, అలర్ట్లు ప్రతి ఏటా వలస వెళ్లడం కంటే, ఒకసారి శాశ్వత పరిష్కారం చూపించండి‘ అనేది చర్ల ముంపు గ్రామాల గోడు. వచ్చే వర్షాకాలానికి ముందే కట్టలు, కాలనీలు ఏర్పాటు చేయకపోతే ఈ నరకయాతన తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.






