6 July, 2026 | 1:54 AM

సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం

06-07-2026 12:46 AM

కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మహబూబాబాద్, జులై 5 (విజయక్రాంతి): సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్థానిక లయన్స్ భవన్లో సీపీఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని శిక్షణ తరగతులకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధాంతపరమైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన రాజకీయ చైతన్యం అవసరమన్నారు. సమాజంలోని మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రజల పక్షాన ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అయోధ్య రామాలయాన్ని ఎన్నికల కోసం వాడుకొని, ఆలయం నిర్మించిన తర్వాత భక్తులు ఇచ్చినటువంటి విలువైనటువంటి కానుకలు డబ్బులు, వెండి ఇటికలను అక్రమంగా ట్రస్ట్ పేరుతో తరలిస్తున్నా కూడా పట్టించుకోకపోవడం ఇదేనా హిందుత్వం అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరంతో సహా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్న దేవాలయాల్లో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.

’మార్క్సిజం సమకాలీన సమాజంలో దాని ప్రాధాన్యత’ అంశంపై మధుకర్, ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో భారతదేశం పర్యవసానాలు’ అంశంపై బీఎస్‌ఆర్ మోహన్ రెడ్డి, ’మతం, మతోన్మాదం, లౌకికవాదం కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ ఎజెండా’ అంశంపై ఉమా మహేష్ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ్ సారధి,  జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్ సారధి, నల్లు సుధాకర్, రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ మాజీ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడ్ల సాంబా లక్ష్మి, పెరుగు కుమార్, వరిపెల్లి వెంకన్న, చింతకుంట్ల వెంకన్న, రేషపల్లి నవీన్, పాండురంగా చారి, నెల్లూరి నాగేశ్వరావు, తొర్రూర్ మండల కార్యదర్శి బందు మహేందర్, సహాయ కార్యదర్శిలు గణపురం లక్ష్మణ్, పెరబోయిన కిరణ్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.