24 May, 2026 | 7:27 PM

కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలి

24-05-2026 05:59 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశం అంబర్‌పేటలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టి, పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తేసే కుట్ర చేస్తున్నదన్నారు.

ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని, నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ (Prepaid) మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, వ్యవసాయానికి ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయన్నారని, మోటార్లకు మీటర్లు రాకముందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రలపైన తిరగబడాలని కోరారు.