తాగునీరు కోసం ఖాళీ బిందెలతో నిరసన.. రోడ్డెక్కిన కాలనీ వాసులు
హైదరాబాద్: ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కష్టాలు షురూ అయిపోయాయి. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అధికారులు, నాయకులు స్పందించకపోవడంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు నీళ్ల కోసం ఆందోళన చేపట్టారు. ఆగ్రహించిన నివాసులు తాగునీటి సరఫరాను డిమాండ్ చేస్తూ బుధవారం నాడు ఖాళీ బిందెలు, డబ్బాలతో ధంతపల్లి రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
కౌన్సిలర్లకు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలూ తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. నాయకులను అడిగితే ఫ్రీగా ఓట్లు వేశారా? రూ.2000 తీసుకోలేదా? అంటున్నారని, అధికారులకు, కౌన్సిలర్లకు ఫోన్లు చేసినా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో కాలువ శుభ్రం చేస్తే రూ. 50, చెత్త తీసుకుపోతే రూ.100 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇవ్వకపోతే పని చేయడం లేదని పారిశుధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణమే తాగు నీరు కావాలంటూ కాలనీ వాసులు దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.






