పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- ప్రచారంలో వాస్తవం లేదు
- సరఫరాను 10,300 కిలోలీటర్లకు పెంచాం
- బల్క్ వినియోగదారులకు డైరెక్ట్ సప్లు
- ఆయిల్ కంపెనీలతో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): దేశంలో కానీ తెలంగాణలో కానీ పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు కలిసి పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి ఎక్కడా కొరత లేదన్నారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
పెట్రోల్, డీజిట్, గ్యాస్ సరఫరా, లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సాధారణంగా రోజుకు సుమారు 6400 కిలోలీటర్ల పెట్రో ల్ సరఫరా జరుగుతుంది, కానీ ప్రస్తుతం అది 10,300 కిలోలీటర్లకు పెంచామన్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా 3200 కిలోలీటర్లు సరఫరా ఉండగా, ఇప్పుడు దాన్ని 6400 కిలోలీటర్లకు పెంచామన్నారు.
ఇదే విధంగా డీజిల్ విషయంలో సాధారణంగా 8000 కిలోలీటర్లు ఉండే సరఫరాను ప్రస్తుతం 15,500 కిలోలీటర్లకు, కొన్ని రోజుల్లో 19,300 కిలోలీటర్ల వరకు పెంచామన్నారు. ఇంత భారీగా సరఫరా పెంచుతున్నప్పటికీ కొరత ఉందని చెప్పడం సరికాదన్నారు. మొత్తం 4325 పెట్రోల్ పంపుల్లో ఉదయం వరకు 106 పంపుల్లో మాత్రమే తాత్కాలికంగా స్టాక్ సమస్య కనిపించిందని, అది కూడా సరఫరా ఆలస్యం, లేదా ముందస్తు చెల్లింపులు చేయకపోవడం వంటి కారణాల వల్లనే అన్నారు.
ప్రస్తుతం ఆ సమస్యను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మనదేశం పెట్రోలియం ఉత్పత్తుల్లో సుమారు 88 శాతం ఇతర దేశాలపై ఆధారపడి ఉందని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని భౌగోళిక పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం అనేక దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ దేశంలో ఎక్కడా కొరత రాకుం డా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అవసరమైనంతే కొనుగోలు చేయాలి..
కొంతమంది రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ద్వారా ధరలు పెరుగుతాయని తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజ ల్లో భయం నెలకొని అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్నారని, నిల్వ అవసరం లేదని ఇది వేసవి కాలంలో ప్రమా దాలకు కూడా దారితీయగలదని హెచ్చరించారు. బంకుల్లో స్టాక్ ఉందన్నారు. బల్క్ వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద కొనుగోలు చేయకుండా, నేరుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ ఇవ్వాలన్నారు.
24 గంటల్లో సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, కొందరు బల్క్ యూజర్లు రిటైల్ బంకుల వద్ద కొనుగోలు చేయడం వల్ల సాధారణ వినియో గదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొ న్నారు. అలాగే ఆటో ఎల్పీజీ విషయంలో ప్రభుత్వ రంగ కంపెనీలు సరిపడా సరఫరా చేస్తున్నాయని, కొన్ని ప్రైవేట్ సరఫరాల్లో మాత్రమే తాత్కాలిక సమస్యలున్నాయని చెప్పారు.
దేశంలో లేదా తె లంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఏదైనా సమస్య ఉంటే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయన కోరారు.






