26 March, 2026 | 2:31 AM

పెట్రోల్ బంక్‌ల ముందు జనం క్యూ

26-03-2026 12:55 AM

ఇంధన కొరతపై వదంతులు 

ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.. వదంతులు నమ్మకండి: సీపీ

కరీంనగర్, మార్చి 25 (విజయక్రాంతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా పెట్రోలియం కంపెనీలు డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా చేయలేక మూతబడుతున్నాయి. నగరంలోని పెట్రోల్ బంకు యజమానులు పెట్రోలియం కంపెనీలకు ముందుగానే డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా లేక బుధవారం నాలుగు బంకు లను మూసివేశారు.

పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్యూ కట్టి మరీ బంకుల నుంచి పెద్దఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే, దీనిపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఇంధన కొరత లేదని, అవసర నిమిత్తం మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని పేర్కొంది.

వదంతులను నమ్మకండి.. నిల్వలు పుష్కలంగా ఉన్నాయి..

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి కొరత లేదు. తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు. ప్రజలు శాంతంగా ఉండాలి. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

 పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం