calender_icon.png 10 February, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

10-02-2026 12:39:49 AM

ఎల్లారెడ్డిలో ఫ్లాగ్ మార్చి నిర్వహించిన పోలీసులు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి):  మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని  డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఆర్డిఓ  పార్థ సింహారెడ్డి అన్నారు. సోమవారం  పోలీస్ 50 మంది బలగాలతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోనీ వార్డుల్లో, గండిమసానిపేట లింగారెడ్డి పెట్, శివారు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.  శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకునేలా వారిలో నమ్మకం కలిగేలా  పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు, పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటిడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణా అరికట్టేందుకు  చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, రూ.50వేల నగదు కంటే ఎక్కువ తీసుకవెళ్తే సీజ్ చేసి జిల్లా గ్రీవియెన్స్ కమిటీకి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకవెళ్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. లేని పక్షంలో సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ,సీఐలు , ఎస్‌ఐలు , పోలీస్ బలగాలు,  సాయుధ బలగాల సిబ్బంది పాల్గొన్నారు.