కాంగ్రెస్‌పై ప్రజల తిరుగుబాటు ఖాయం
- ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా హస్తం పాలన
- బీఆర్‌ఎస్ కోసం వెతుక్కుంటూ వస్తారు
- తెలంగాణ బీఆర్‌ఎస్‌నే కోరుకుంటోంది
- ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్టయ్యింది
- బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్ పట్టుకొని మళ్లీ జనం బీఆర్‌ఎస్ పార్టీ కోసం వెతుక్కుంటూ వస్తారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాక ఓపికతో పజా సమస్యలపైన పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ విజయ ప్రస్థానంలో తాజా ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
రెండున్నర దశాబ్దాల బీఆర్‌ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే ఉన్నాయన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదన్నారు. ఎన్ని ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొంది ముందడుగు వేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌కు ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వారానికి రెండు నియోజకవర్గాలు
ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. తన చేష్టలతో ప్రజలతో ఛీ కొట్టించుకోవడమే కాంగ్రెస్ వైఖరి అని, ప్రజలు అనతికాలంలోనీ ఆ పార్టీ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదన్నారు.
తన పట్ల తెలంగాణ సమాజం చూపుతున్న ప్రేమాభిమానాలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని, వారు మాత్రమే రావాలని చెప్పారు. అలా చేస్తేనే కడుపు నిండా మాట్లాడవచ్చని సూచించారు. ఎక్కువమంది రావడం వల్ల కాలు నొప్పి ఉన్న తాను ఐదారు గంటలు నిలబడలేకపోతున్నానని వివరించారు.
సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కోటిరెడ్డి, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






