థియేటర్లలో ఇక పర్సంటేజీ సిస్టమ్
తెలుగు చిత్రసీమలో ఓ చారిత్రక మార్పునకు తెలంగాణలోని థియేటర్ల యాజమాన్యాలు శ్రీకారం చుట్టాయి. దీంతో టాలీవుడ్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రెంటల్ వివాదానికి తెలంగాణ ఎగ్జిబిటర్లు తెర దించారు. ఇకపై థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించే ‘రెంటల్ సిస్టమ్’ స్థానంలో, వసూళ్లలో వాటాను పంచుకునే ‘పర్సంటేజీ సిస్టమ్’ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానానికి సంబంధించి రాష్ట్రంలోని 23 ప్రధాన థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే తమ అంగీకారం తెలిపాయి. ఈ 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందినవే. ఈ మార్పు ఏప్రిల్ 3వ తేదీ అంటే.. శుక్రవారం (నేడు) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది.
దీంతో చిత్ర పరిశ్రమలో పంపిణీదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రెంటల్ విధానం ప్రకారం.. సినిమా ఫలితాలకు సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు భారీగా అద్దెలు చెల్లించాల్సి వచ్చేది. సినిమా ఫ్లాప్ అయితే పంపిణీదారులు నిలువునా నష్టపోయేవారు. కానీ, తాజా పర్సంటేజీ విధానంలో థియేటర్ వసూళ్లలో కొంత శాతం యాజమాన్యానికి, మిగిలినది డిస్ట్రిబ్యూటర్‌కు దక్కుతుంది. సినిమా బాగా ఆడితే ఇద్దరికీ లాభం, తగ్గితే నష్టం కూడా పంచుకోనున్నారు. ముఖ్యంగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఈ విధానం కాస్త ఊరటనిచ్చే అంశమే.
టీఎస్‌ఎఫ్‌సీసీతో చర్చలు
తాజా నిర్ణయాలపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్‌ఎఫ్‌సీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. 23 మంది ఎగ్జిబిటర్లు ఇటీవల తమ (టీఎస్‌ఎఫ్‌సీసీ) సంప్రదించారని ఈ ప్రకటన ద్వారా తెలియజేసింది. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో తమతో చర్చించిన విశేషాలను వివరించింది. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్న ప్రీమియం థియేటర్లేనని, వాటిల్లో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని, అయితే ఈ థియేటర్ల నిర్వహణకు చాలా ఖర్చవుతోందని టీఎస్‌ఎఫ్‌సీసీ పేర్కొంది.
ప్రస్తుత అద్దె విధానంతో వారు మనుగడ సాగించలేకపోతున్నామని తెలిపారు. పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రతిపాదనను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్‌రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి, ఆ తర్వాత అభిప్రాయం చెప్తామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం పర్సంటేజీ ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని, ఇది విడతల వారీగా జరుగుతుందని ఎగ్జిబిటర్లు.. ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో తప్ప అంతటా పర్సంటేజీ విధానమే..
మార్చి 11న బెంగళూరులో జరిగిన దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశంలోనూ దీనిపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని టీఎస్‌ఎఫ్‌సీసీ డిస్ట్రిబ్యూటర్లు, సినీ నిర్మాతలకు ఈ సందర్భంగా తెలిపింది. మన తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లు పర్సంటేజీ విధానాన్నే అనుసరిస్తున్నాయని, సింగిల్ స్క్రీన్ల మనుగడ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫిల్మ్ చాంబర్ పేర్కొంది.
ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా..
రెంటల్ విధానానికి బదులు పర్సంటేజీ విధానంలో సినిమాల ప్రదర్శన కోసం ఎప్పటి నుంచో ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 23 థియేటర్ల యాజమాన్యాలు ముందడుగు వేశాయి. ఫలితంగా సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం ఎగ్జిబిటర్లకు వర్తించనుంది.




