10-07-2025 12:00:00 AM
మనోహరాబాద్, జూలై 9 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జోరుగా మట్టి అక్రమ దందా జరుగుతున్నది. పొద్దంతా, రాత్రంతా ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఇతర నాయకులు సైతం మట్టి దందాకు పాల్పడుతున్నారు.
ఎక్కడికక్కడే రెవెన్యూ, పోలీస్, గనులు, భూగర్భ శాఖాధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నుండి ఒకచోటకు అనుమతి తీసుకొని వందలాది టిప్పర్లలో రియల్ వ్యాపారులకు, వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మనోహరాబాద్ మండలంలోని పారిశ్రామిక ప్రాంతాలైన ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, కొండాపూర్ ప్రాంతాలలో జోరుగా మట్టి దందా కొనసాగుతుంది.
ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాత్రుల్లో అక్రమంగా మట్టి తరలించేవారు. కానీ గత కొన్ని రోజుల నుండి పట్టపగలే టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అడవి ప్రాంతాల నుండి జేసీబీల సహాయంతో స్తంభాల లోతులో నుండి తోడుతున్నారు. ఎవరైనా నిలదీస్తే మీ సొమ్మేం పోతుంది.. అధికారులే మాకు అనుమతులు ఇచ్చారంటూ బెదిరిస్తున్నట్లు పలువురు ఆరోపించారు.
అధికారుల అనుమతి అసలు ఉందా లేదా తెలియదు గానీ అక్రమ మట్టి వ్యాపారస్తులు మాత్రం విచ్చలవిడిగా మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీల ద్వారా మట్టిని తీసిన ప్రాంతంలో భారీగా గోతులుగా మారి వర్షపు నీరు నిలిచి పోవడంతో లోతు ఏర్పడక పశువులు, మనుషులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఒక క్యూబిక్ మీటర్కు ప్రభుత్వానికి రూ.20 చెల్లించి వారి అవసరాల మేరకు మట్టిని తరలించకపోవచ్చు. కానీ అలా చేయకుండా ఒక అనుమతితో ఎక్కడికి పడితే అక్కడికి ఈ మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ వనరులను కొల్లగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అడ్డగోలుగా అక్రమంగా వందలాది టిప్పర్లతో మట్టి తరలించుకుపోతుంటే అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అక్రమంగా మట్టి తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయాలని కోరుతున్నారు.