అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ఆసిఫాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.సిర్పూర్-టి మండలానికి చెందిన షకీల్ హుస్సేన్ గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ సప్లై చేసిన బిల్లులు చెల్లించాలని కోరగా, జైనూర్ మండలం దూరాతండా గ్రామస్థులు తమ గ్రామ ఆశా కార్యకర్తను తొలగించాలని కోరారు. రెబ్బెన మండలం గోనేటి గ్రామ రైతులు తమ ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో బోర్లు వేసినందున విద్యుత్ సరఫరా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్కు చెందిన మసాడె అరుణ్ తన కుమారుడికి గురుకుల విద్యాలయంలో సీటు ఇప్పించాలని దరఖాస్తు సమర్పించారు. దహేగాం మండలం కమ్మరపల్లి గ్రామానికి చెందిన జరుపుల సురేష్ తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని కోరారు. పెంచికలపేట మండలం గుండెపల్లి గ్రామానికి చెందిన తలండి ముత్తుబాయి తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి తన పేరిట పట్టా మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని సూచించారు.






