calender_icon.png 20 January, 2026 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మా కంపెనీతో ప్రజల భవిష్యత్తుకు ముప్పు

20-01-2026 12:27:45 PM

కంచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో ప్రతిపాదిత ఫ్యూజన్ ఫార్మా కంపెనీ నిర్మాణాలు స్థానిక ప్రజల భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్నాయని మంగళవారం కంచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి సాయగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించి కంపెనీ నిర్మాణాలను కొనసాగించడం తగదని ఆయన స్పష్టం చేశారు. బిక్కనూరు మండల పరిధిలోని 18 గ్రామాల ప్రజలు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి అదనపు కలెక్టర్‌తో పాటు పర్యావరణ శాఖ అధికారులకు అందజేశారని, అయినప్పటికీ ఇప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతుండడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.

ఫార్మా పరిశ్రమ ఏర్పాటుతో వాయు, నీటి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంబటి సాయగౌడ్ మాట్లాడుతూ, ఇది వ్యక్తిగత పోరాటం కాదని, 18 గ్రామాల ప్రజల హక్కులు, రాబోయే తరాల భవిష్యత్తును కాపాడుకునేందుకు చేపట్టిన ఉద్యమమని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఫార్మా కంపెనీ నిర్మాణాలను నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు