20-01-2026 12:37:47 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవుసుల కార్తీక్ (12) అనే బాలుడు మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో రెండంతస్తుల భవనం పై నుంచి కిందపడిన కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.