మరోసారి తెరపైకి ఫార్మాసిటీ

02-05-2024 01:18:53 AM

ఫార్మా రద్దు ప్రకటనపై కాంగ్రెస్ యూటర్న్

అసెంబ్లీ ఎన్నికల్లో  వెనక్కు తీసుకుంటామని హామీ

అధికారంలోకి వచ్చాక విరుద్ధ ప్రకటనలు

అయోమయంలో పడ్డ  రంగారెడ్డి జిల్లా రైతులు 

మూడు పార్లమెంట్ సెగ్మెంట్లపై పడనున్న ప్రభావం

రంగారెడ్డి, మే 1(విజయక్రాంతి): తాము అధికారంలోకి వస్తే ముచ్చర్ల ఫార్మాసిటీ రద్దు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీల వర్షం కురిపించారు. దీంతో ఎన్నికల్లో ఫార్మా బాధిత రైతులు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫార్మా రద్దుకు నిర్ణయం తీసుకొంటామని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని కిసాన్ జాతీయ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పా రు. రైతుల క్షేమం కోసం ఫార్మాసిటీ వేరే ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేశారు. కానీ, వారం రోజుల తర్వాత తమ హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఫార్మా సిటీని రద్దు చేయబోమని, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా విలేజ్‌లను నిర్మించి అందరికీ న్యాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ భూము లు తమకు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. కాగా, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఫార్మా  అంశం చర్చానీయాంశమైంది. 

19,333 ఎకరాల్లో...

రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తాల, ఆమనగల్లు మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో ప్రపంచ స్థాయి లో ఫార్మాసిటీ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ 2015లో శ్రీకారం చుట్టారు. పదివేల ఎకరాలకు పైగా ఫార్మాసిటీ పేరుతో రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. సేకరించిన పట్టా భూములకు ఎకరానికి రూ.16 లక్షలు,  అసైన్డ్ భూమి ఎకరానికి రూ.8 లక్షల చొప్పు న రైతులకు చెల్లించారు. దీంతో అంతర్జాతీ య స్థాయిలో పేరు పొందిన కంపెనీలు తమ ప్లాంట్ల ఏర్పాటును వేగంగా ప్రారంభించాయి. అయితే కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమాలు సైతం చేశారు. ఫార్మా కంపెనీలతో తమ ప్రాంతం కలుషితమవుతుందని, ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలక పక్షం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళనకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. 

మూడు సెగ్మెంట్లపై ప్రభావం...

భువనగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మూడు పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 14 గ్రామాలకు చెందిన బాధిత రైతులు ఉన్నారు. మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాడిపర్లి, ముద్విన్, ఏక్వాయిపలి, మర్రిపల్లి, గోవిందాయిపల్లి, కర్కల్‌పహావడ్, మైసిగండి, కడ్తాల పంచాయతీ పరిధిలోని గ్రామాలు, ముచ్చర్ల, మీరాఖాన్‌పేట్, పంజాగూడ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 20 వేల ఓట్లు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు ఫార్మా రైతులు ఎవరికీ ఓటు వేస్తారోనన్న సందిగ్ధంలో పడ్డారు. అధికార పార్టీ హామీల అమలులో విఫలమైందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ రైతుల ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆరేళ్ల పోరాటం...

గత ఆరేళ్ల నుంచి రైతులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. యాచా రం, ముచ్చర్ల, దాసర్లపల్లి గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున ఉద్యమించారు. తమ భూములను ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదంటూ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా అంశం అప్పట్లో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అసెంబ్లీలోనూ విపక్షాలు ఫార్మా అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. ఫార్మా పేరు చెప్పి రైతుల వద్ద తక్కువ ధరకు భూములు లాక్కొని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి బీఆర్‌ఎస్ ప్రభు త్వం రియల్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డాయి. 

ఈ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఇదే అంశాన్ని నేతలకు రైతులు వివరించారు. తమ ప్రభు త్వం వస్తే ఫార్మాసిటీని వెనక్కు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు మల్‌రెడ్డి రంగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా రద్దు అంశంపై యూటర్న్ తీసుకొవడంతో ఆ నేతలు బహిరంగంగా మాట్లాడలేక పోతున్నారు.