ఎర్లీబర్డ్‌తో భారీ ఆదాయం
ఏప్రిల్ మాసంలో రూ. 827కోట్ల వసూలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు (ఎర్లీబర్డ్) ద్వారా భారీ ఆదాయం సమకూర్చుకుంది. ముందస్తు ఆస్తిపన్ను చెల్లించిన వారికి మొత్తం పన్నులో 5శాతం రాయితీ సదుపాయం కల్పించడంతో ఎర్లీబర్డ్ పథకానికి ఏటేటా చెల్లింపుదారుల నుం చి విశేష స్పందన లభిస్తోంది. ఫలితంగా ఆర్థిక ఏడాది ప్రారంభం ఏప్రిల్ మాసంలోనే బల్దియాకు భారీ ఆదాయం సమకూ రుతోంది. గత పదేళ్లకు పైగా అమలవుతున్న ఎర్లీబర్డ్ స్కీంలో ఈ ఏడాది అత్యధికంగా రూ. 827కోట్లు వసూళ్లను రాబట్టుకుని గత రికార్డులను అధిగమించింది. ఈ ప్రక్రియలో నిరంతరం శ్రమించిన అధికారులు, సిబ్బందిని రోనాల్డ్ రోస్ అభినందించారు.
గత రికార్డును అధిగమించి..
గ్రేటర్‌లో దాదాపు 19లక్షల భవన నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా 5శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రూ. 827.31కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది (2023 ఎర్లీబర్డ్ ద్వారా రూ. 786 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది గత రికార్డులను అధిగమించి, రూ. 41 కోట్లకు పైగా వసూలు కావడం విశేషం. సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా రూ. 85.84కోట్లు, మీసేవా ద్వారా రూ. 48.80కోట్లు, బిల్ కలెక్టర్ల ద్వారా రూ. 280.85 కోట్లు వసూలు కాగా, ఆన్‌లైన్ ద్వారా రూ. 411.79కోట్లు వసూలు కావడం విశేషం.
అత్యధికంగా శేరిలింగంపల్లిలో...
గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ పరిధిలో గత ఏడాది ఎర్లీబర్డ్ ద్వారా 6,10,000 వేల మంది ఆస్తిపన్ను చెల్లిస్తే, ఈ ఏడాది 7,34, 837 మంది తమ ఆస్తిపన్నును ఎర్లీబర్డ్ ద్వారా చెల్లించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో అత్యధికంగా రూ. 109.23కోట్లు, జూబ్లీహిల్స్ సర్కిల్‌లో రూ. 84.50 కోట్లు, ఖైరతా బాద్ సర్కిల్‌లో రూ. 69.03కోట్లు, మూసాపేట సర్కిల్‌లో రూ. 54.82కోట్లు, చందా నగర్‌లో రూ. 52.97కోట్లు అత్యధికంగా వసూలయ్యాయి. అత్యల్పంగా చంద్రాయణగుట్టలో రూ. 2.78కోట్లు, ఫలక్‌నూమాలో రూ. 3.11 కోట్లు, చార్మినార్‌లో రూ. 5.35 కోట్లు, ఆర్‌సీపురం, పటాన్‌చెరులో రూ. 7.07 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఎర్లీబర్డ్ స్కీంలో ఒక్క నెలలోనే రూ. 827 కోట్ల ఆదాయం బల్దియాకు రావడంపై అధికారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.




